మెట్రో డ్రైవర్‌ అప్రమత్తత

ట్రాక్‌ దాటబోతున్న యువకుడికి తప్పిన ముప్పు
న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి):   మెట్రో రైలు డ్రైవర్‌ అప్రమత్తత ఓ యువకుడి ప్రాణాలను నిలబెట్టింది. 21ఏళ్ల మయూర్‌ పాటిల్‌ అనే యువకుడు దిల్లీలోని శాస్త్రి నగర్‌ మెట్రో స్టేషన్‌లో పట్టాలు దాటి వేరే ఫ్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆగి ఉన్న మెట్రో రైలు కదిలింది. ఫ్లాట్‌ఫాం ఎక్కబోతున్న మయూర్‌ను గమనించిన డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో రైలు ఆగిపోయింది. కిందపడబోయిన మయూర్‌ వెంటనే పక్కకు జరిగి ఫ్లాట్‌ఫాం ఎక్కేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది. రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఒక ఫ్లాట్‌ఫాం నుంచి వేరే ఫ్లాట్‌ఫాంకు ఎలా వెళ్లాలో తెలియక ట్రాక్‌ దాటినట్లు అతడు వెల్లడించాడు. దీంతో మయూర్‌కు పోలీసులు జరిమానా విధించారు. డ్రైవర్‌ ఏమాత్రం ఏమరపాటుగా ఉండి.. బ్రేక్‌ వేయడం ఒక్క క్షణం ఆలస్యమైనప్పటికీ అతడు రైలు కింద పడిపోయేవాడు. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో అతడికి చిన్న గాయం కూడా కాకుండా ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు.  ఈఘటనకు సంబంధించి డ్రైవర్‌ను పలఉవురు అభినందించారు.