మెడికల్ సీట్ల విషయంలో.. తెలంగాణకు అన్యాయం : వినోద్
హైదరాబాద్, జూలై 26 : మెడికల్ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. గురువారంనాడు ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్ నేతృత్వంలోని బృందం వైద్య విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ రత్నకుమార్‌ను సచివాలయంలో కలిసింది. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగినా.. తెలంగాణ మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆయన విమర్శించారు. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కాపాడేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని, అలాంటిది తెలంగాణ మెడికల్ కళాశాలల ఏర్పాటుకై మంచి లాయర్లను ప్రభుత్వం ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యతగా తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని వినోద్ డిమాండు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రక్రియ త్వరితగతిన జరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ ప్రక్రియ ఆలస్యమైతే మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ జెఎసి తలపెట్టే మార్చ్‌లో పాల్గొనేది.. లేనిది పార్టీ ఇంకా నిర్ణయించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఖాజీపేట జంక్షన్‌ను కొత్త రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేయాలని రైల్వే బోర్డు కమిటీకి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ లేఖ రాశారని ఆయన తెలిపారు. ఈ అంశంపై పలుమార్లు లోక్‌సభలో లేవనెత్తినా ప్రయోజనం లేకపోయిందని ఆయన అన్నారు. రైల్వే శాఖకు తెలంగాణ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోందని ఆయన గుర్తు చేశారు. విజయవాడ డివిజన్‌ను జోన్‌గా మార్చేందుకు సీమాంధ్ర నేతలు డిమాండు చేయాలని ఆయన అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలలో హైకోర్టు తీర్పుపై ఆందోళన చేస్తున్న సీమాంధ్ర నేతలు చట్టాలు తెలియని అజ్ఞానుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా చట్టాన్ని అమలు చేయాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.