మెదక్‌ బంద్‌ విజయవంతం

అడ్డుకోవడం మూర్ఖత్వం : హరీశ్‌
మెదక్‌/సిద్దిపేట, మే 3 (జనంసాక్షి) :
బయ్యారం ఉక్కును తప్పకుండా తరలించుకు పోతాం ఏంచేస్తారో చేసుకోండని నాలుగు రోజులక్రితం మెదక్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు జిల్లాలో విజయవంతమైంది. తెల్లవారు జామునే ఆర్టీసీ డిపోల ఎదుట టీిఆర్‌ఎస్‌ నేతలు ధర్నాకుదిగారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య వర్గాలు బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. బంద్‌ను విఫలం చేసేందుకు గాను పోలీసులు గురువారం అర్ధరాత్రి నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్ట్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 మందిని అరెస్ట్‌ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్దిపేట ధర్నాకు ఎమ్మెల్యే హరీష్‌రావు నాయకత్వం వహించి డిపో ఎదుట భైఠాయించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే వర్గీయులు బంద్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగారెడ్డి శివారులో రెండు బస్సులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పోలీసులు రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. నాయకులు అరెస్ట్‌లను నిరసిస్తూ స్టేషన్లలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట బస్సు డిపో ఎదుట ధర్నాకు దిగిన పద్మాదేవేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి అహంకార పూరిత వ్యాఖ్యలకు నొచ్చుకున్న జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా మెదక్‌తో పాటు చేగుంట, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్‌, పటాన్‌చెరువు, గజ్వేల్‌, చిన్నకోడూరు తదితర మండలాల్లో నాయకులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బంద్‌కు మద్దతుగా పెట్రోల్‌బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు మూసివేశారు. చాలా వరకు దుకాణాలు మూసి వేయడంతో పాటు బస్సులు నడవక పోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుబ్బాక డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించడంతో కర్ణాటక నుంచి వచ్చే బస్‌లు నిలిచిపోయాయి. పెద్దఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్‌రావును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడంతో పెద్దఎత్తున కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంద్‌ను అడ్డుకోవడం మూర్ఖత్వం అని ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. బంద్‌లో బాగంగా సిద్దిపేట బస్సుడిపో ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజలనే కాక తెలంగాణా ప్రజలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి బహిరంగసభలో వ్యాఖ్యానిస్తే కూడా చీమునెత్తురు లేని దద్దమ్మలుండడం వల్లే సీమాంధ్రులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. మెదక్‌ జిల్లాలో నేతలైతే సిఎం అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేవరకు టీిఆర్‌ఎస్‌ విశ్రమించదన్నారు. తెలంగాణ సొత్తును దోచుకెల్తున్న సీమాంధ్రులకు సద్దికడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టినట్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మద్దతుంది కాబట్టే బంద్‌ సంపూర్ణంగా విజయవంతం అవుతుందన్నారు. బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీని పెట్టకుండా కేవలం వెరిఫికేషన్‌ ప్లాంట్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తామనడం దుర్మార్గమన్నారు. ఇక్కడి ఖనిజంతో మాత్రం విశాఖపట్నంలో  మరో 40వేల కోట్లు వెచ్చించి స్టీల్‌ఫ్యాక్టరీని విస్తరించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉందన్నారు. సీమాంద్ర నేతలకుగాని, రాష్ట్ర ప్రభుత్వానికి గాని సంబందం లేకుంటే ఆఫ్యాక్టరీలో 35వేల మంది ఉద్యోగుల్లో ఎంతమంది తెలంగాణవారికి అవకాశం కల్పించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. బయ్యారంలో నుంచి ఇసుమంత ఇనుప ముక్కను కూడా తీసుకుపోనియ్యమని హరీష్‌రావు హెచ్చరించారు.