మెరిసిన మార్కెట్లు

ముంబై, ఏప్రిల్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనావేయడం, ద్రవ్యోల్బణం ఐదు శాతం కంటే దిగువకు పడిపోవడంతో సూచీలు రివ్వున ఎగిశాయి. మంగళవారం స్టాక్ మార్కెట్లు ముగిసిన అనంతరం వెలుబడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో బుధవారం ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన సూచీలు ఒక దశలో 500 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి.
sensex
ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాట పట్టడం, మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. అలాగే చైనా ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి సానుకూల అంశాలు సూచీలు మరింత పుంజుకోవడానికి దోహదపడ్డాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 481.16 పాయింట్లు లేక 1.91 శాతం పెరిగి 25,626.75 వద్ద స్థిరపడింది. జనవరి 1 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 7,800 మార్క్‌ను దాటింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 141.50 పాయింట్లు (1.84 శాతం) బలపడి 7,850.45 వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 952.91 పాయింట్లు(3.86 శాతం), నిఫ్టీ 295.25 పాయింట్లు(3.76 శాతం) లాభపడ్డాయి. దీంతో మదుపర్ల సంపద రూ.1.35 లక్షల కోట్లు పెరిగి రూ.96.92 లక్షల కోట్లకు చేరుకుంది. వర్షపాతం సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంటుందన్న అంచనాతోపాటు భారత్ వృద్ధిరేటు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నివేదిక విడుదల చేయడం మదుపరుల్లో ఆశలు పెంచాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు మరింత దూసుకుపోవడానికి దోహదపడ్డాయని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.06 శాతం పెరుగగా, మిడ్-క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం లాభపడింది. ఈ నెల చివర్లో విప్రో షేర్లను బై-బ్యాక్ చేయనున్నట్లు ప్రకటించడంతో కంపెనీ షేరు ధర 2.89 శాతం పెరిగి రూ.584.60 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 7.40 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ 5.40 శాతం, బజాజ్ ఆటో 4.95 శాతం, భెల్ 4.88 శాతం, మారుతి 4.42 శాతం, టాటా మోటార్స్ 3.40 శాతం, హీరో మోటోకార్ప్ 3.33 శాతం చొప్పున అధికమయ్యాయి. హెచ్‌యూఎల్, టాటాస్టీల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐలు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. రిలయన్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, గెయిల్, లుపిన్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఖరీఫ్ సీజన్‌లో సానుకూల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేయడంతో ఎరువులు, ఇరిగేషన్, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థల షేర్లు లాభాల బాట పట్టాయి. రంగాలవారీగా చూస్తే ఆటో 3.59 శాతం లాభపడగా, బ్యాంకింగ్ 2.56 శాతం, ఫైనాన్స్ 2.27 శాతం, మెటల్ 2.14 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.86 శాతం, రియల్టీ 1.69 శాతం, పవర్ 1.37 శాతం, ఇండస్ట్రీయల్ 1.35 శాతం, ఎనర్జీ 1.33 శాతం, యుటిలిటీ 1.14 శాతం చొప్పున పెరిగాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో 28 లాభాల్లో ముగియగా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ మాత్రమే నష్టపోయాయి.

రూపాయి రూటే వేరు..

గడిచిన మూడు రోజులుగా పుంజుకున్న దేశీయ కరెన్సీ విలువ పతనాన్ని మూటగట్టుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు తగ్గి 66.64 వద్దకు చేరుకుంది. డాలర్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంకర్లు, దిగుమతిదారులు మొగ్గుచూపడటంతో కరెన్సీ పతనాన్ని నమోదు చేసుకుంది. గడిచిన మూడు రోజుల్లో 23 పైసలు పెరిగిన మారకం విలువ బుధవారం ఒకేరోజు ఇదే స్థాయిలో పతనమైంది.

మళ్లీ సోమవారం స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండు రోజులు సెలవులొచ్చాయి. గురువారం అంబేద్కర్ జయంతి , శుక్రవారం శ్రీరామనవమి కావడంతో స్టాక్ మార్కెట్లు సెలవుపాటించనున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. వీటితోపాటు ఫారెక్స్, మనీ, బులియన్, ఆయిల్‌సీడ్స్ మార్కెట్లు కూడా బంద్‌పాటించనున్నాయి.