మెస్, కాస్మోటిక్ ఛార్జిలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్ డిమాండ్
నిజామాబాద్, జూలై 20 : ప్రభుత్వ వసతి గృహ సమస్యలు పరిష్కరించి, మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతవిద్యార్థి సమాఖ్య(ఎఐఎస్‌ఎఫ్) శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుండి ఎస్పీ క్యాంప్ కార్యాలయం మీదుగా ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లకుండా బారీకేడ్లను,ఇనుపకంచెలను అడ్డంగా పెట్టారు. కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను అడ్డుకోవడంతో ఆగ్రహించిన వారు కంచెలను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కాసేపు విద్యార్థులకు, పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. అయినా గానీ విద్యార్థి నాయకులు వినపోయే సరికి పోలీసులు వారిపై జులూంను ప్రదర్శించారు. విద్యార్థులను ఈడ్చుకెళుతూ పోలీసు జీపుల్లో,వ్యానుల్లో ఎక్కించారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన వన్‌టౌన్, త్రీటౌన్,ఫోర్త్ టౌన్‌లకు తరలించారు. ఈ సందర్బంగా ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ మాట్లాడుతూ ఈ నెల 9 నుండి 16 వరకు జిల్లా వ్యాప్తంగా సైకిళ్లపై 1200 కిలోమీటర్లు తిరుగుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. చాలా వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలైన మంచినీరు, గదులు, బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు, విద్యుత్ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక వసతి గృహాలు స్వంత భవనాలు లేక శిథిలావస్థలో ఉన్న అద్దే భవనాల్లో ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ చదువులను కొనసాగిస్తున్నారన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కాబోతున్నా ఇప్పటి వరకు అనేక వసతి గృహాల్లో యూనిఫాంలు, పెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు ఇవ్వలేదన్నారు. నెలకోసారి వసతి గృహాన్ని సందర్శించాల్సిన డాక్టర్లు రాకపోవడంతో సీజనల్ వ్యాధులతో పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ ఒక్క వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని, స్థానికంగా ఉండాల్సిన వార్డెన్లు విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వలన విద్యార్థులు భయాందోళనలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచకపోవడం వలన తగినంత భోజనం పెట్టకుండా అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వసతి గృహ సమస్యలు పరిష్కరించి తక్షణం, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దశరత్, కిరణ్, జ్వాలారాణి, భానుప్రసాద్, రమేష్, నాగరాజు, రాజన్న, నర్సింలు, ప్రతాప్, రవి, ప్రశాంత్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.