మేం పార్టీ మారుతున్నాం

1

– కాంగ్రెస్‌ అంతర్గత కలహాలతో విసిగిపోయాం

– ఈ నెల 15న ముహూర్తం

– మీడియా సమావేశంలో గుత్తా, వివేక్‌, రవీంద్ర

హైదరాబాద్‌,జూన్‌13(ఆర్‌ఎన్‌ఎ): పలువురు కాంగ్రెస్‌ నేతలతో సహా ఇతరులు టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచార సస్పెన్స్‌కు తెరపడింది. టిఆర్‌ఎస్‌లో చేరుతారంటూ వస్తున్న ప్రచారాలపై స్వయంగా ఆ నేతలే తెరదించారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో వీరంతా పాల్గొన్నారు.తాము టిఆర్‌ఎస్‌లో చేరుతున్న వార్త నిజమేనంటూ ధృవీకరించారు. దీంతో ప్రచారానికి అనుగుణంగా  కాంగ్రెస్‌, సీపీఐ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు కారెక్కేందుకు హుర్తం ఖరారైంది. అంతర్గత కుమ్ములాటలతో కుతకుతలాడిపోతున్న తెలంగాణా కాంగ్రెస్‌ కు వీరి నిర్ణయంతో పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి వినోద్‌, ఎంపీ వివేక్‌,  జువ్వాడి నర్సింగరావుతోపాటు సీపీఐ ఎమ్మెల్యే రవీందర్‌నాయక్‌ విూడియా సమావేశంలో మాట్లాడారు. తాము 15న బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఈ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే తెరాసలో చేరుతున్నట్లు కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, వివేక్‌, ఆయన సోదరుడు వినోద్‌లు ఈనెల 15న తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీరు ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవడానికే తెరాసలో చేరుతున్నట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్‌కు తోడుగా నిలవాలన్న సదుద్దేశంతోనే తాము పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన సోనియాకు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. సమయం, సందర్భానుసారం తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియాకు రుణపడి ఉంటామని అన్నారు. ఆమె తెలంగాణ ఇచ్చిందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవన్నారు. మిషన్‌ భగీరధ పై తనకు కొన్ని అనుమానాలు వచ్చి ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమని నల్లగొండ ఎమ్‌.పి గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చాయని ఆయన చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై, సలహాదారులపై క్యాబినెట్‌ ¬దా ఇవ్వడంపై కోర్టుకు వెళ్లానని, అయితే ఆ వ్యవహారం  కోర్టులలో ఉందని, తీర్పు వచ్చినప్పుడు నిర్ణయాలు జరుగుతాయని ఆయన అన్నారు. విూడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తాను రాజీనామా చేయడానికే కట్టుబడి ఉన్నానని,సందర్భం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని తొంభై ఐదు శాతం మంది తనకు చెబుతున్నారని , ఎవరికైనా ఇష్టం లేని వారు ఉంటే వారిని క్షమించాలని కోరుతున్నానని గుత్తా అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకు దేవత అన్నదానిపై సందేహం లేదని అన్నారు. ఆమె కూడా త్వరలో పదవి దిగిపోవచ్చని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కు నష్టం కలిగించేలా అంతర్గత కలహాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తనతో కాంగ్రెస్‌లో ఎవరికీ విభేదాలు లేవని, అలాగే తాను కూడా ఎవరినీ విభేదించలేదన్నారు. తనను ఇంతకాలం ఆదరించి

గెలిపించిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తమకు ఎవ్వరితో తగాదా లేదని, జానారెడ్డి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా అందరు కాంగ్రెస్‌ నాయకులతో తాము సహకరించామని, వారు కూడా తమతో సఖ్యతతో మెలిగారని గుత్తా అన్నారు. తాను పార్టీ మారడానికి 90 శాతం ప్రజలు ఆమోదముద్ర వేశారని, ఈ విషయం ఫోన్‌ కాల్స్‌ ద్వారా నూ, వ్యక్తిగతంగా కలిసినపుడూ తనకు తెలిసిందని అంటూ అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనకాడనని గుత్తా చెప్పారు.

అభివృద్ది కోసమూ కెసిఆర్‌కు సహకరిస్తున్నం

మాజీ ఎమ్‌.పి వివేక్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ దళితుల అబివృద్దికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ లో  చేరుతున్నామని  మాజీ ఎంపీ వివేక్‌ చెప్పారు. తమ తండ్రి ఆశయసాధనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారాయన. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో రెండేళ్లుగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనే పూర్తి విశ్వాసం చూపిస్తున్నారు. పునరేకీకరణలో భాగంగానే సాధారణ ఎన్నికల్లోను.. తర్వాత రెండేళ్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌ పై పూర్తి విశ్వాసాన్ని చూపిస్తూ వచ్చారు. ఇవన్నీ గమనించాక కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం కోసం మేం టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రాష్ట్ర సాధన కోసం మా నాన్నగారి నుంచి మా వరకు చివరి దాకా మా వంతు పాత్ర పోషించాం. అందులో భాగంగానే అప్పట్లోనే టీఆర్‌ఎస్‌ లో చేరాం. అయినా కూడా తెలంగాణ ఇస్తే పార్టీకి తిరిగొస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చాం. ఎన్నికలకు ముందు రావడం వల్ల రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా అన్నింటికీ సిద్ధపడి మాట విూద నిలబడ్డాం.కొత్త తెలంగాణ ను జనం కోరుకున్న అభివృద్ధి దిశగా నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మా వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకా అవకాశం కనిపించడం లేదు. అందుకే టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నాం. ప్రజల్లో ఉండి వారి కోసం పనిచేయడం మా లక్ష్యం. దాన్ని కొనసాగిస్తాం. మా నాన్న గారి ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం.

తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. తెలంగాణ కోసం ఆమె చేసిన మేలును జనం, మా కుటుంబం ఎప్పటికీ మరిచిపోం అని అన్నారు వివేక్‌. ఈ నెల 15న తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు నల్గొండ పార్లమెంట్‌ సభ్యుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ (సీపీఐ), మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి వినోద్‌, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు కుమారుడు జువ్వాడి నర్సింగరావు లు కూడా టీఆర్‌ ఎస్‌ లో చేరుతున్నట్లు విూడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని, అంతర్గత కలహాల వల్లే తాము పార్టీని వీడుతున్నామని చెప్పారు. సోనియాగాంధీ పట్ల విధేయత వ్యక్తం చేసిన ఈ నాయకులు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చి రాష్టాభ్రివృద్ధికి సహకరించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ లో గిరిజనులకు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితుడనై తాను పార్టీ మారుతున్నానని నల్లగొండ జిల్లా దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ ప్రకటించారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా తమ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు.దిండి స్కీమ్‌ తో పాటు దేవరకొండ నియోజకవర్గానికి అభివృద్ది కోసం ,ఎమ్‌.పి సుఖేందర్‌ రెడ్డితో పాటు టిఆర్‌ఎస్‌ లో చేరుతున్నామని ఆయన అన్నారు.కేవలం అభివృద్ది,ప్రభుత్వానికి షహకరించాలన్న లక్ష్యంతో తాను పార్టీని వీడుతున్నానని అన్నారు. దేవరకొండ చాగా వెనుకబడిన ప్రాంతమని, అందువల్ల ఆ ప్రాంతం అభివృద్ది చెందడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రవీంద్ర కుమార్‌ అన్నారు. దీంతో తెలంగాణ శాసనసభలో సిపిఐ ప్రాతినిద్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈయన రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి జగదీష్‌ రెడ్డి మంతనాలు జరిపి ఈయనను పార్టీలోకి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. నల్గొండ ఎమ్‌.పి గుత్తా సుఖేరందర్‌ రెడ్డి, మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కరరావులు టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయం కాగా సిపిఐ ఎమ్మెల్యే కూడా వస్తుండడం విశేషం.బహుశా సిపిఐని శాసనసభలో విలీనం చేస్తున్నట్లు రవీంద్ర కుమార్‌ స్పీకర్‌ మదుసూదనాచారికి లేఖ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

బంగారు తెలంగాణకోసమే గులాబీ దళంలో చేరుతున్నాం: వినోద్‌

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ తండ్రి వెంకటస్వామి కాకా కల అని, ఆయన కలను సాకారం చేసేందుకే తాను తన సోదరుడు వివేక్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని మాజీ మంత్రి జి.వినోద్‌ ప్రకటించారు.  బంగారు తెలంగాణ కావాలనే తాము టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నామన్నారు. తెలంగాణ ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుందో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. కేసీఆర్‌తో కలిసి అభివృద్ధిలో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నాన్నకు ఇచ్చిన మాట మేరకు ముందుకు కదులుతామన్నారు.ఆయన తన సోదరుడు వివేక్‌, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావుతోపాటు సీపీఐ ఎమ్మెల్యే రవీందర్‌నాయక్‌, ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలసి విూడియా సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని  అన్నారు. రాష్టాభ్రివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. తాము ఎల్లుండి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గొప్ప మనసుతో తెలంగాణను ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు. ఇవాళ మళ్లీ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని స్పష్టం చేశారు. రాష్టాభ్రివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు సహకరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేసీఆర్‌ కూడా అభివృద్ధి సాధనలో విూరంతా కలిసివస్తే బాగుంటుందని సూచించారని వెల్లడించారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము కాంగ్రెస్‌లో ఉండి కృషి చేశామన్నారు.