మేం బంగ్లా ఖాళీ చేయడానికి సిద్ధంగా లేము

– మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌
లక్నో, మే29(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎంలందరూ ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఒక్కో నేత ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఈ విషయంలో విూడియాపై మండిపడ్డారు. బంగ్లా ఖాళీ చేయడానికి రెండేళ్ల సమయంలో కావాలంటూ అఖిలేష్‌, ఆయన తండ్రి ములాయం సుప్రీంకోర్టులో కౌంటర్‌ వేశారు. దీనిపై విూడియా ప్రశ్నించగా.. అఖిలేష్‌ అసహనం వ్యక్తంచేశారు. మేం బంగ్లాలు ఖాళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ కొంత సమయం కావాలి. లక్నోలో నాకు, మా నాన్నకు మరో ఇల్లు లేదు. విూరేదైనా ఇల్లు చూపిస్తే వెళ్తాం అంటూ విూడియాకు కౌంటర్‌ వేశారు. విూరు ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. తన ఆరోగ్యం బాగా లేని కారణంగా సమయం కావాలని ములాయం కోరగా.. భద్రత, తన పిల్లల చదువు కారణంగా చూపుతూ రెండేళ్ల గడువు ఇవ్వాలని అఖిలేష్‌ కోర్టును కోరారు. మరోవైపు మరో మాజీ సీఎం మాయావతి అయితే తన బంగ్లాను ఏకంగా తన గురువు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ జ్ఞాపకార్థం మ్యూజియంగా మార్చేశారు. ఐదు ఎకరాల్లో పది బెడ్‌రూమ్‌లతో ఎంతో విలాసవంతంగా ఉండే ఈ ఇంటికి శ్రీ కాన్షీరామ్‌ రామ్‌జీ యాద్‌గార్‌ విశ్రామ్‌ స్థల్‌ అంటూ మాయావతి ఓ బోర్డు ఏర్పాటు చేయించారు. 15 రోజుల్లోగా బంగ్లాలు ఖాళీ చేయాలని ఆరుగురు మాజీ సీఎంలకు యూపీ ప్రభుత్వం పది రోజుల కిందటే నోటీసులు పంపించింది.