మేడారంలో ‘తెలంగాణ’ మొక్కు చెల్లించుకున్న కోదండరాం

1
వరంగల్‌,ఫిబ్రవరి 17(జనంసాక్షి): మేడారంలో ఏర్పాట్లు గతంలో కన్నా భేషుగ్గా ఉన్నాయని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ అన్నారు. ఆయన బుధవారం మేడారం దర్శించుకుని అమ్మవార్లకు బంగారం సమర్పించుకున్నారు. గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక తెలంగానలో జాతర ఏర్పాట్లు బాగున్నాయన్నారు. ఇదిలావుంటే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ముందే భక్తజనం పోటెత్తారు. అమ్మలను ఆహ్వానించడానికి మేడారంలో భక్తులంతా సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు విచ్చేస్తుంది. అమ్మ రాకకు ముందే భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మంగళవారం 5లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10గంటల వరకు లక్షా 50వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా.  భక్తుల రాక క్రమంగా పెరుగడంతో ద్దెల వద్ద భక్తులతో రద్దీగా ఉంది. దర్శనానికి 3గంటల సమయం పడుతుంది. గద్దెల వద్ద రద్దీక్రమేణా పెరుగుతుండటంతో పోలీసుశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మేడారం జాతర ప్రధాన ఘట్టం బుధవారం ప్రారంభం కానుండడంతో మంగళవారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది.  ఒక రోజులో లక్ష నుంచి రెండు లక్షల చొప్పున భక్తులు పెరిగారు. బుధవారం ప్రధాన ఘట్టమైన సారలమ్మ దేవత గద్దెకు రానుండడంతో భక్తుల రద్దీ నెలకొంది. ప్రైవేటు వాహనాల నుంచి భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. బుధ, గురువారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. ఆర్టీసీ 36 రూట్ల నుంచి బస్సులను నడుపుతోందని స్థానిక బస్టాండులోనూ 36 కౌంటర్లలో టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.  జాతరలో ఇబ్బందులు తలెత్తకుండా.. దర్శనం అయిన వారిని వెంటనే ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క క్యూ లైన్ల ద్వారా ప్రశాంతంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బస్టాండ్‌ పరిసరాల్లో భక్తులకు తాగునీటి వసతి సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడ్డారు. మరో పక్క పలువురికి ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. సారలమ్మ రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సెక్టోరియల్‌ అధికారులు ఆ గ్రామంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కన్నెపల్లి దారుల్ని సిద్ధం చేశారు. వూళ్లొ నుంచి జంపన్నవాగు వరకు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో నేరుగా కలెక్టర్‌ వాకాటి కరుణనే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. జాతర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. జంపన్నవాగు, చుట్టుపక్కల అటవీ ప్రాంతం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కంట్రోల్‌ రూమ్‌, గద్దెల ప్రాంతాలు.. ఇలా పలు చోట్ల తిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అడవుల్లో చెట్లు కొట్టేస్తున్న భక్తుల్ని మందలించారు.