మేధోమథనం సాక్షిగా విషం కక్కిన సీమాంధ్ర నేతలు

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన మేధోమథనం సాక్షిగా తెలంగాణపై సీమాంధ్ర పెద్దమనుషులు విషం చిమ్మారు. సమావేశానికి ముందే తెలంగాణపై చర్చించవద్దంటూ ఆంక్షలు పెట్టాలని చూసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్సనారాయణ వేదికపై తన అసలు రంగు బయటపెట్టుకున్నాడు. సదస్సులో మాట్లాడిన కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వందలాది మంది విద్యార్థుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సభలో కూర్చొనే నివాళులర్పిస్తామని పీసీసీ అధ్యక్షుడు అమరవీరులను అవమానించే ప్రయత్నం చేశారు. దీనిని నిరసిస్తూ పొన్నం ఆవేశంగా మాట్లాడారు. కూర్చొని నివాళులర్పించడం ఏమిటని నిలదీశారు. అమరులను అవమానించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు చెప్పారు. వేదికపై ఉన్న వారు, వేదిక కింద ఉన్న లేచి నిలబడి అమరులకు నివాళులర్పించి తీరాలని పట్టుబట్టారు. ఈక్రమంలో వేదికపై ఉన్న వారు నిల్చునే ప్రయత్నం చేయగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్సనారాయణ జోక్యం చేసుకుని నిల్చోబోయే వారిని అడ్డుకున్నారు. వేదికపై మాట్లాడుతున్న పొన్నం మైక్‌ కట్‌ చేశారు. సభకంటూ ఒక గౌరవం ఉంటుందని నీతులు చెప్పే ప్రయత్నం చేయబోయారు. దీంతో వేదికకు ఎదుట ఉన్న తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా నిరసన తెలిపారు. దీంతో ఎల్బీ స్టేడియమంతా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది.

సొంతపార్టీ నేతలే పీసీసీ అధ్యక్షుడి తీరుపై భగ్గుమనడంతో వేదికపైనే ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనభీ ఆజాద్‌ జోక్యం చేసుకుని తెలంగాణ అమరులకు, నీలాం తుఫాను మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ప్రకటించారు. దీంతో ఆందోళన సద్దుమణిగినప్పటికీ తెలంగాణపై సీమాంధ్ర నేతల వివక్ష బట్టబయలైంది. పీసీసీ అధ్యక్షుడు కాక ముందు బొత్స సత్యనారాయణ తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటని అన్నాడు. తెలంగాణ ప్రజలది న్యాయమైన డిమాండ్‌ అని, 1969 నుంచి వారు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని అనేక వేదికలపై మాట్లాడారు. దీంతో అతడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినపుడు తెలంగాణ ప్రాంతం నేతలెవరూ అడ్డుచెప్పలేదు. ఆయన జోడు పదవుల్లో కొనసాగినపుడు కూడా ఎవరూ ప్రశ్నించలేదు. సీమాంధ్ర ప్రాంతానికి చెందన ఎందరో పెట్టుబడీదారులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నపుడు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపినా బొత్సను పల్లెత్తు మాటకూడా అనలేదు. పీసీసీ అధ్యక్షుడి సీట్లో కూర్చున్న తర్వాత బొత్స ప్రవర్తనలో క్రమక్రమంగా మార్పు వచ్చింది. అంతకుముందు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటన్న ఆయన తెలంగాణ పేరిత్తెతేనే చిర్రెత్తిపోతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన వ్యవహార శైలిని సునిశితంగా గమినిస్తున్న వారంతా ఇది సడెన్‌గా వచ్చిన మార్పుకాదని చెప్తుంటారు. ఇప్పట్లో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు ఉండబోవని ఢిల్లీ పెద్దలు తేల్చి చెప్పిన తర్వాత బొత్స స్వరం హెచ్చింది. ఇక తనను ఎవరు ఏం చేయలేరనే అతివిశ్వాసం తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్‌ను అపహాస్యం చేసేలా చేసింది. అందుకు సాక్ష్యమే మేధోమథనం వేదికపై ఆయన పొన్నంపై విరుచుకుపడిన తీరు. సభకు అధ్యక్షుడినైనా తాను చెప్పినట్లే అంతా నడుచుకోవాలని ఆయన ఆధిపత్యం ప్రదర్శించబోయారు. కానీ తెలంగాణ ప్రతినిధులు మూకుమ్మడిగా నిరసన తెలిపి ఢిల్లీ ప్రతినిధి ఆజాద్‌ ఎదుట పరువు బొత్స పరువును గంగలో కలిపేశారు. పరిస్థితి అంతదూరం వస్తేగాని ఢిల్లీలో అవాకులు చెవాకులు పేలే ఆజాద్‌కు తెలంగాణ ఆకాంక్ష తెలిసిరాలేదు. ఆయనే స్వయంగా పోడియం వద్దకు వచ్చి నివాళులర్పిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఒక్క ఘటన చాలు పెట్టుబడీదారుల స్పాన్సర్డ్‌ ఉద్యమం ఎంతోకాలం నిలువబోదని తేల్చిచెప్పడానికి. గులాంనబీ ఆజాద్‌ కూడా ఈ విషయం గురించారు అనుకోవాలి. ఆయన గుర్తించకుంటే ఎల్బీ స్టేడియంలో మార్మోగిన జై తెలంగాణ నినాదాల్లో కొద్ది క్షణాల్లో పది జిల్లాలకు వ్యాపించేవి. అదే జరిగితే అధినేత్రి చేతిలో మొదట చీవాట్లు తినేది ఆజాదే. తన జాదూరిక పారదని ఆయన గుర్తించారు కాబట్టే అధ్యక్షుడిని పక్కనబెట్టి అమరవీరులకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ బాబు చెప్పాడని తప్ప వేదికపై ఉన్న ఒక్క నేత తెలంగాణ అమరులకు మనస్ఫూర్తిగా నివాళి అర్పిస్తున్నట్లు టీవీ తెరలపై కనిపించలేదు. మీడియా విస్తృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏం జరిగిందో క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతుంది.

అన్నీ తెలిసి కూడా సీమాంధ్ర ప్రాంత నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మ గౌరవంపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణవాదం లేదనో, కాంగ్రెస్‌ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందనో చెప్పుకునే సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే మంచింది. 2004 ఎన్నికల కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని చేర్చినపుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదు? యూపీఏ కామన్‌ మినిమం ప్రోగ్రాంలో, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టినపుడు ఎందుకు అధినాయకత్వాన్ని నిలదీయలేదు? అంటే అప్పుడు చెప్పినవన్నీ ఉత్తుత్తి మాటలేనని వారు అనుకున్నారా? అదే నిజమైతే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధుల గమ్యం ఏమిటో వారు తేల్చుకోవాలి.