మేరే అబ్బాజాన్‌కీ గావ్
టీవీలో క్రికెట్ చూస్తున్నానన్న మాటేగానీ మనస్సంతా ఆఫీసులో రామారావు అన్న మాటల మీదు ఉంది ఎంత అలవోకగా అనేశాడు. తలచుకొంటేనే మనసు భగ్గున మండుతుంది. ‘ఆ సాయేబుకి పాకిస్తానే గెలవాలని ఉంటుంది’. నవ్వుతూ నవ్వుతూనే అన్నాడు. అతని మాటలు పల్లేరుగాయాల్లా గుచ్చుకొంటున్నాయి.
తొమ్మిదిన్నర దాటింది. ఆఫీసుకెళ్ళడానికింకా గంటన్నర టైముంది. టీవీ ముందు కూర్చున్నానన్న మాటేగానీ మనస్సంతా పరిపరివిధాల పోతుంది. కాలింగ్ బెల్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాను. లేచి తలుపు తీశారు. టెలిగ్రాంతో పోస్ట్‌మాన్. సంతకం పెట్టి టెలిగ్రాం తీసుకొన్నాను.
‘ఐదు గంటలకి పుప్పూ చనిపోయింది రెహమాన్ పుప్పూ (మేనత్త)కి డెబ్భై అయిదేళ్లుదాటి ఉంటాయి. రెండు మూడు నెలలుగా పుప్పూ ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలిసిందే. బతికి ఉండగా ఓసారి చూసి రావాలనుకొంటూనే చూడలేక పోయాను. అందుకూ నా మీద నాకే కోపం వచ్చింది. మా పప్పా (నాన్నగారి)తాలూకు చివరి మనిషి పుప్పూ, నాన్నగారు చనిపోయి ఎనిమది సంవత్సరాలైంది. తాయా (పెద్దనాన్న) చనిపోయి ఆరేళ్లయింది. పుప్పూ చివరిది. వాళ్ల తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. అత్తయ్యకి పిల్లలు లేరు. ఆమె భర్త ఎప్పుడో చనిపోయాడు. రెహమానే ఆమె బాధ్యత స్వీకరించాడు. రెహమాన్ మా తాయా పెద్దకొడుకు.
మా పప్పా ఊరికి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మూడు నాలుగుసార్లు వెళ్లి ఉంటానేమో. ఆరేళ్ల క్రితం తాయా చనిపోయినప్పుడు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు పెళ్లిళ్లకీ చావులకీ తప్ప మామూలుగా మా పప్పా ఊరు వెళ్లలేదు. వాటిక్కూడా ఓ సారి బడే భాయీ మరోసారి చోటే భాయీ ఒక్కోసారి నేను సెలవుల్లో రమ్మని తాయాజాన్ ఎన్నోసార్లు ఉత్తరాలు రాశారు. కానీ ఎందుకో వెళ్ళనేలేదు.
మా పప్పా తన ఇరవై రెండో ఏట ఇంట్లో గొడవపడి మా ఊరొచ్చి స్థిరపడ్డాడు. మా నాన్నే మా ఊరి ప్రాంతంలోని తొలి డాక్టర్ మా ఊరి దగ్గర్లోని పల్లెటూరులోని మా అమ్మీని పెళ్ళి చేసుకొన్నాడు. మా ఊరికీ నాన్నగారి ఊరికీ ఐదు వందల కీలో మీటర్ల దూరం మా నాన్నే అప్పుడప్పూడూ వెళ్ళి వచ్చేవాడు. ఆ ఊరితో మాకు సంబంధాలు తక్కువే. మా పాప్పఆ బంధువులు అప్పుడప్పూడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. మా అక్కయ్యలు, అన్నయ్యలు, నేనూ అందరమూ మా ఊళ్లోనే పుట్టి పెరిగాము.
టెలిగ్రాం తీసుకొని లోపలికి వచ్చి ఆ విషయం చెప్పాను. అమ్మీది దిగాలు పడింది. చావు అనివార్యమైనప్పటికీ అదో భయం. వెళ్దామని చెప్పింది. బ్యాగ్ సర్దేయమని మా ఆవిడకు చెప్పాను. లీవులెటర్ రాసి ఆఫీసులో ఇచ్చి వచ్చాను. పదకొండు గంటలకి హైదరాబాద్ బస్సు ఉంది. అక్కడ్నించి ఐదుగంటల ప్రయాణం. మా ఊరికి ఫోన్ చేసి అన్నయ్యలకి ఈ విషయం చెప్పాను. వాళ్ళకి కూడా టెలిగ్రాములు అందాయట. అమ్మని తీసుకొని నన్ను వెళ్ళమని చెప్పారు. వాళ్ళు దహుమ్‌కి (పదిరోజుల్లో చేసే కార్యక్రమం) వెళ్తామని చెప్పారు.
అమ్మీజాన్, నేనూ ఇద్దరమూ మా నాన్నగారి ఊరికి బయల్దేరాము. ఆరుగంటల ప్రాంతంలో మా నాన్నగారి ఊరు చేరాము. ఇల్లు వెతుక్కొవడంలో కష్టమేమీ కాలేదు. గుర్తుంది. మా నాన్నగారి ఇల్లు పాతబడిపోయింది. నిశ్వబ్దంగా ఉంది. రెహమాన్ పిల్లలు హైదారాబాద్ నుంచి రానట్టున్నారు. కొంతమంది బంధవులు, రెహమాన్ తోబుట్టువులు ఇంట్లో ఉన్నారు. అమ్మను చూడగానే గొల్లుమన్నారు. మా కోసం చూసీ చూసీ పుప్పూ శవాన్నిఆరగంట క్రితమే డోలాలో తీసుకెళ్ళారట, ఓ కుర్రవాన్ని ఇచ్చి ఖబరిస్తాన్‌కి నన్ను పంపించారు. పరుగు పరుగున అక్కడికి వెళ్ళాను. మసీదులో జనాజ్‌కి నమాజ్ చేయించి పుప్పూ శవాన్ని అప్పుడే అక్కడికి తీసుకొచ్చారు. ఆఖ్‌రీ దీదార్ చూపించారు. పుప్పూ మోహం చివరిసారి చూసాను. తత్‌ఫీన్ అయిపోయింది. అమ్మ మాత్రం పుప్పూ మోహం చూడలేకపోయింది.
మహబూబ్ మామూ మా దగ్గరి బంధువు. నన్ను ఊళ్ళోకి తీసుకు వెళ్ళాడు. ఒకరిద్దరు నున్న పలకరించారు. గుర్తుకు రాలేదు. ఒకరిద్దని పరిచం చేశాడు. మా నాన్న, అతను కలిసి చదువుకొన్నారట. వాళ్ళు కలిసి చదువుకొన్న స్కూలు, ఆటలాడిన స్థలాలు, ఈతలు కొట్టిన వాగూ అన్నీ చూపించాడు. మామూ. అన్నీ అపరిచితంగానే ఉన్నాయి. నాన్నగారి జ్ఞాపకాలు చెప్పాడు. శ్రద్ధంగా విన్నాను. ఇంటికి వచ్చాం. మా నాన్న చదువుకొనే గదినీ, ఆయన ఎప్పూడు కూర్చునే పాత కూర్చీని అన్నీ మహబూబ్ మామూ చూపించాడు.
తెల్లవారింది. భారంగా, బయల్దేరాలి తిరిగి సెలవులు లేవు. మధ్యాహ్నం రెండు గంటలకి బస్సు ఉంది. ఆ బస్సుకి వెళ్తామని రెహమాన్‌కి చెప్పాను. ఆ రోజు ఉండిపోమ్మని రెహమాన్ భాభీజాన్ బలవంతం చేశారు. ఆఫీసులో పనులున్నాయని చెప్పాను. పుప్పూలూయీ, పప్పాల ఫోటోలు ఆల్బమ్ నుంచి తీసుకొన్నాను. మళ్ళీ ఎప్పుడొస్తావో నువ్వు అన్నాడు. రెహమాన్. దిగులుగా అన్పించింది.
భోజనాలు చేసి రెండు గంటల బస్సుకి అమ్మ, నేను బయల్ధేరాం. మా నాన్నగారు చదువుకొన్న స్కూలునీ, ఆడుకొన్న మైదానాలని, ఆయన బాల్యంతో పెనవేసుకొన్న ఇంటినీ ఊరినీ దాటుకొంటూ బస్సు బయల్దేరింది. రెహమాన్ అన్నట్లు మళ్లీ ఎప్పుడు చూస్తానో మా నాన్నగారి ఊరు.
ఏడు గంటలకి హైదరాబాద్ చేరాం. ఆ రాత్రి మా ఛోటీ ఒహెన్ ఇంటికి వెళ్ళాం ఉదయాన అమ్మీజాన్ కోరిక మీద ఊరు బయలేదేరాం. పదిగంటల ప్రాంతంలో బస్సు మా ఊరి పోలిమేరలకు వచ్చింది. అక్కడి గాలి పీలుస్తూనే ఏదో ఆనందం ఎన్నో జ్ఞాపకాలు. పొలాలని చూస్తూనే అక్కడ ఆడుకొన్న జ్ఞాపకాలు. మక్క కంకులు కాల్చుకొన్న రోజులు.. అన్నీ గుర్తుకొచ్చాయి. అమ్మని రిక్షాలో ఇంటికి పంపించి నడుస్తూ ఊళ్లోకి బయల్దేరాను. వాగు దాటి వెళ్తుంటే అక్కడ ఎగిరి గంతులేసిన రోజులు, ఈతలు కొట్టిన రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి. మెడికల్ షాపు దగ్గర చంద్రమౌళితో సంభాషణ, ఫొటో స్టూడియోలో రవీంద్రతో అభిభాషణ ముగించి దారివెంట మిత్రుల ఆత్మీయుల పలకరింపులకి జవాబులిస్తూ ఇంటికి దారితీశాను. భీమన్న గుడి దగ్గర మా పాతబడి. జ్ఞాపకాలతో మనసు కొట్టుకొంది.
ఇంటికి వచ్చాను. కచేరీలో నాన్నగారి ఫొటో. ఆయన ఎప్పుడూ కూర్చుండే కుర్చీ. ఎడమ పక్కన ఆయన ఎప్పుడూ పేషంట్లని చూసే రూమునీ చూస్తే ఇంకా ఆయన ఉన్నట్టే అన్పించింది. బావి దగ్గరికి వెళ్లి కాళ్లు కడుక్కొన్నాను. మా నాన్నగారు అక్కడ స్నానం చేసేవారు. మాకు చేయించేవారు. జ్ఞాపకాలతో తడిసి ముద్దైపోయాను.
మా ఊరికీ, మా నాన్నగారికి ఊరుకీ ఎంతభేదం? అపరిచితానికీ, ఆత్మీయతకీ ఉన్నంత తేడా. నేను రాగానే మా ఊరు నన్ను కౌగిలించుకొంది. ఆత్మీయంగా ఒళ్లంతా తడిమింది. ఆప్యాయంగా నిమిరింది. మా నాన్నగారి ఊరూ, ఇల్లూ చూసినపుడు ఎలాంటి స్పందనా లేదు. పరాయిగా అన్పించింది. అలాంటి నాకు, మా నాన్నగారే, మా తాతగారే చూడని దేశం మీద ఏం ప్రేమ ఉంటుంది. ఇదే మాట రామారావుని అడగాలనుకొన్నాను.