మే 14న తెలంగాణ ఎంసెట్‌

4

ఈనెల 25న నోటిఫికేషన్‌

ఎంసెట్‌ కన్వీనర్‌ వెల్లడి

హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెలంగాణలో మే 14న ఎంసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి  సంబంధించి ఈనెల 25న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రబుత్వం ఎమ్సెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈమేరకు ఇవాళ హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎన్‌వి రమణారావు ఎంసెట్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఈనెల 25న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈనెల 28 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 15 నుంచి 20 వరకు దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. మే 8 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  మే 28న ర్యాంకులను ప్రకటించనున్నారు. కాగా, ఆంధప్రదేశ్‌ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదని, ఏపీ విద్యార్థులు ఎంసెట్‌ రాయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే రాయాలని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. మే పద్నానాలుగో తేదీన ఎమ్సెట్‌ పరీక్ష జరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు.ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.ఈ నెల ఇరవైఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.జెఎన్‌ టియు పరీక్షలు నిర్వహిస్తుంది.గత కొంతకాలంగా ఎమ్సెట్‌ వ్యవహారం ఎపి, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. ఉమ్మడిగానే ఎమ్సెట్‌ పరీక్ష జరపాలని ఎపి ప్రభుత్వం తొలుత పట్టుబట్టింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత చూపలేదు.దీనిపై తర్జనభర్జనలు జరిగాయి. చివరికి ఎవరికి వారే పరీక్షలు నిర్వహించుకోబోతున్నారు.