మే 2న ఎంసెట్‌ పరీక్ష

2
– షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షను మే 2న నిర్వహించనున్నారు. ఎంసెట్‌ ప్రకటన గురువారం విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి ఎంసెట్‌కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌ 3 నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 24 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తారు. మే 12న ఎంసెట్‌ ఫలితాలు వెల్లడించనున్నారు. తొలిసారిగా ఓఎంఆర్‌ కాపీని విద్యార్థులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వివరాలను ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనన్‌ డాక్టర్‌ రమణారావులు బుధవార్‌ం నాడిక్కడ వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించకపోవడం అనేది విద్యార్థుల మంచి కోసమే అని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. ప్రతి సెంటర్లో వాచీలను ఏర్పాటు చేసి ప్రమాణాల ప్రకారమే సమయ నిబంధనలను అమలు చేస్తామన్నారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. వచ్చే ఏడాది తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో మెడికల్‌ పరీక్ష ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వనపర్తిలో ఎంసెట్‌ కేంద్రాలను నెలకొల్పుతామన్నారు. మే 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్‌ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 వరకు మెడిసిన్‌, అగ్రికల్చర్‌ పరీక్ష జరగనుంది.  ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు స్వీకరణకు మార్చి 28వ తేదీ చివరి తేదీగా ఉంది. ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు ఆన్లైన్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు. రూ.500ల ఫైన్‌తో  ఏప్రిల్‌ 3 వరకు, రూ.వెయ్యి ఫైన్‌తో ఏప్రిల్‌ 13, రూ.5వేల ఫైన్‌తో ఏప్రిల్‌ 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 24 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. మే 3న ప్రాధమిక కీ విడుదల, మే 12న ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు.