మైక్‌ హస్సీ సెంచరీ : ఎదురీదుతున్న లంక

¬బార్ట్‌, డిసెంబర్‌ 15: శ్రీలంకతో జరుగుతోన్న మొదటి టెస్టులో ఆస్టేల్రియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ భారీస్కోర్‌ చేసిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ రాణించి లంకను టాపార్టర్‌ను దెబ్బతీసింది. దీంతో రెండోరోజు కూడా ఆసీస్‌దే ఆధిపత్యం కనబరిచింది. 4 వికెట్లకు 299 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్టేల్రియా కాసేపటికే క్లార్క్‌ వికెట్‌ కోల్పోయింది. 74 పరుగులు చేసిన మైకేల్‌ క్లార్క్‌ ఎరంగా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే మైక్‌ హస్సీ , మాథ్యూ వేడ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. లంక బౌలర్లపై ఆధిపత్యం కనబరిచిన హస్సీ స్కోర్‌ 400 దాటించాడు. ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అటు వేడ్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేయడంతో ఆసీస్‌ స్కోర్‌ 450కి చేరింది. వేడ్‌ , హస్సీ ఆరో వికెట్‌కు 146 పరుగుల పార్టనర్‌షిప్‌ సాధించారు. అయితే మ్యాచ్‌ ఫలితం రావాలనే ఉధ్ధేశంతో క్లార్క్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. 5 వికెట్లకు 450 పరుగుల దగ్గర తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. అప్పటికి హస్సీ 115 , వేడ్‌ 68 పరుగులో ఉన్నారు. లంక బౌలర్లలో వెలిగెదరా 3 వికెట్లు పడగొట్టాడు. వెంటనే ఇన్నింగ్స్‌ ఆరంభించిన క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కరుణారతనే 14 , సంగక్కరా 4 , జయవర్థనే 12 , సమరవీరా 7 పరుగులకు ఔటయ్యారు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లకు 87 పరుగులు చేసింది. దిల్షాన్‌ 50 పరుగులతో క్రీజులో ఉండడమే ఆ జట్టుకు ఊరట. ప్రస్తుతం ఆరు వికెట్లు చేతిలో ఉన్న శ్రీలంక ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో లేని నేపథ్యంలో లంక ఫాలోఆన్‌ గండం అధిగమించడం అనుమానమే.