మైనార్టీ కార్పొరేషన్‌ అక్రమాల్లో కదులుతున్న డొంక

ఇప్పటికి నలుగురు నిందితుల అరెస్ట్‌
నకిలీ ఖాతాలతో చేతులు మారిన 55.47 కోట్లు
దోచిన సొమ్ముతో టీవీ చానల్‌ కొనుగోలుకు ఒప్పందం
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తూరులో 200 ఎకరాలు..
రాజధానిలో 5 కోట్లతో ఫ్లాట్ల కొనుగోలు
హైదరాబాద్‌, అక్టోబర్‌  11 (జనంసాక్షి) :
రాష్ట్రంలో ప్రజా ధనానికే కాదు, దేవుడి సొమ్ముకు కూడా భద్రత లేకుండా పోతోంది. దీనికి మొన్న వెలుగు చూసిన మైనార్టీ కార్పొరేషన్‌, వక్ఫ్‌బోర్డులో గల్లంతైన నిధుల సంఘటనే సాక్ష్యం. మైనార్టీల ఆస్తులకు రక్షణ కవచంలా నిలిచే వక్ఫ్‌ బోర్డు నిధులు రూ.55.47 కోట్లు గల్లంతైనట్లు గురువారం జరిగిన విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు కీలక నిందితులు సాయికుమార్‌, కేశవరావు, వెంకట్రావ్‌, సాగర్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. వీరు నకిలీబ్యాంకు ఖాతాలు తెరిచి నిధులు మళ్లించినట్లు గురించారు. దోచిన సొమ్ముతో ఏబీసీ టీవీ చానల్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ఉండే కొత్తూరు పారిశ్రామిక వాడలో 2 వందల ఎకరాలు, హైదరాబాద్‌లో 5 కోట్లతో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో నగదు, కీలక పత్రాలు, కార్లును స్వాధీనం చేసుకున్నారు. 80 కోట్ల మైనార్టీ కార్పొరేషన్‌ నిధులను కోఠిలోని విజయా బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. ఇందులో నుంచి 55.47 కోట్లు గల్లంతైనట్లు మైనార్టీ కార్పొరేషన్‌ కార్యదర్శి దాన కిశోర్‌ గురించారు. ఆయన ఈ అక్రమాన్ని మంత్రి అహ్మదుల్లా, సీఎస్‌ మిన్నీ మాథ్యూ, సీఎం కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు ఉద్యోగి సయ్యద్‌ అలీని సస్పెండ్‌ చేసి, సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ అధికారులు వెంటనే స్పందించి, విచారణ మొదలు పెట్టడంతో నిందితులు వారి చేతికి చిక్కారు. కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ గోల్‌మాల్‌ జరిగినట్లు నిందితులు సీఐడీ అధికారులకు వివరించినట్లు సమాచారం. అధికారులు ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.