మొక్కలు నాటి స్ఫూర్తిని నింపండి

అదే భవిష్యత్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌
నిజామాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే నాటిన వారు వాటిని సంరక్షించాలని, కొత్తగా నాటనివారు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది మన పిల్లలకు అందించే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లాంటిదని గుర్తుంచు కోవాలన్నారు. పారిశుద్యం మనందరి బాధ్యత అని, ప్రజలు స్వచ్ఛతను పాటించాలని అన్నారు. అంటువ్యాధులు దూరంగా ఉండాలంటే ఇది తప్పదని అన్నారు. ప్రజలందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ఇంటి వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించుకొని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌తో దేశ రాజధాని ఢల్లీిలో నివసిస్తున్న ప్రజలు నెలల తరబడి బయటకు వెళ్లని పరిస్థితులు నెలకొంటాయని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలకు కూడా అదే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో మనమంతా బాధ్యతగా మెలగాలని అన్నారు. అటవీ సంపదను పెంపొందించడంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంలో ప్రజలు
భాగస్వామ్యం కావాలన్నారు. అడవులను నరకడం వల్లనే ఇవాళ అనేక అనర్థాలు వచ్చాయని అన్నారు. ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని పోచారం పిలుపునిచ్చారు. అవసరమైనన్ని మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని ఒక వేళ కొరత ఏర్పడితే ప్రత్యేక నిధులను కేటాయించి మొక్కలను కొనుగోలు చేసి సరఫరా చేస్తామన్నారు. అధికంగా మొక్కలు నాటి పర్యావరణంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నారు. వంద శాతం మొక్కలను నాటి త్వరగా జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకురావాలన్నారు. మహనీయుల పేరిట మొక్కలు నాటించాలన్నారు. పుట్టిన రోజు, పెళ్లి రోజులు, స్మారక దినోత్సవాలు, జయంతులు, వర్ధంతులు, మహనీయుల పేర్లతో మొక్కలు నాటితే విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అన్నారు. అధికారులు బాధ్యతగా పని చేస్తేనే అది విజయవంతం అవుతుందన్నారు.