మోడీ దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌

అవినీతి పుత్రుడు జగన్‌

అభివృద్ది పుత్రుడు చంద్రబాబు నాయుడు

కర్నూలు పర్యటనలో లోకేశ్‌ వ్యాఖ్యలు

కర్నూలు,జూలై10(జ‌నం సాక్షి): ప్రధాని మోదీ దత్తత పుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ అని మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పుత్రుడు చంద్రబాబు అయితే అవినీతి పుత్రుడు జగన్‌ అని విమర్శించారు. వీరిద్దరూ బిజెపిని విమర్శించకుండా రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన మంత్రి గూడూరు మండలం నాగలాపురం పొలాల్లో పంట కుంటలను పరిశీలించారు. లోకేశ్‌ను ఎడ్లబండిలో ఊరేగించారు. రైతు వేశంలో చినబాబు ఆకట్టుకున్నాడు. అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించామన్నారు. ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఆయన పర్యటనలు చూస్తుంటే నారా లోకేశ్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తుండటంతో అధినేత చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించగా, లోకేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. కర్నూలులో సోమవారం లోకేశ్‌ ప్రచారం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైంది. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీలో అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న యువ నేత నారా లోకేశ్‌ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాలు.. మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. రాష్ట్ర పర్యటన ద్వారా జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లను సరిదిద్దనున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో తొలి విడత పర్యటన పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. ధర్మపోరాట సభలను సైతం ఇకపై నెలకు ఒకటి లేదా రెండు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.