మోడీ పాలనలో మార్పు లేదు

2A

యూపీఏ-3లా ఉంది

సురవరం సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి): నరేంద్ర మోదీ పాలన యూపీఏ పాలనకు కొనసాగింపుగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఏడు నెలల పాలనపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో  ఆయన  మాట్లాడుతూ ఇది  యూపీఏ -3 వలే ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వాగ్ధానాలలో భాగంగా నల్లధనం తీసుకురావడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. మోదీ ఏడునెలల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న శక్తుల పట్ల మోదీ ఉదారంగా వ్యవహరిస్తున్నారన్నారు. యూపీఏ విధానాలనే కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తోందని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అవలంభించిన ఆర్థిక విధానాలనే.. మోడీ మరింత వేగంగా ఫాలో అవుతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం విదేశాలకు అప్పగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసమే సరళీకరణ ఆర్థిక విధానాలను దూకుడుగా ప్రవేశపెడుతోందని విమర్శించారు. చట్ట సభలు జరగని సమయంలో దొడ్డిదారిన అరాచకంగా భూ ఆర్డినెన్స్‌, బొగ్డు కేటాయింపులు ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌లు ప్రజలు నడ్డివిరిచే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ఎనిమిది నెలల పాలనలో దేశంలో అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. కేంద్రం మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ఇది లౌకిక వ్యవస్థకు ప్రమాదకరమని తెలిపారు. దీనిని వామపక్ష, లౌకికతత్వ పార్టీలతో కలిసి ఐక్యంగా తిప్పికొడతామని చెప్పారు.  సీపీఐ చీలినప్పటి నుంచే వామపక్షలు బలహీనపడుతున్నాయని  గుర్తు చేశారు. వామపక్షాల ఐక్యత మా ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ సెంట్రల్‌ కమిటీ కొత్త రాజకీయ విధానం ప్రవేశపెట్టిందని తెలిపారు. కేవలం సీఎం పదవి కోసమే కిరణ్‌ బేడీ బీజేపీలో చేరి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో నిజాం చరిత్రతోపాటు వ్యతిరేక పోరాటాలు కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని సురవరం సుధాకర్‌ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాలను విస్మరించడం ద్వారా ఇక్కడి పోరాటాలను తక్కువ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది చరిత్రను వక్రీకరించడమే అవుతుందన్నారు.