మోదీకి మతపరమైన పిచ్చి
– ముస్లింలతోపాటు గిరిజనుల రిజర్వేషన్లు పెండింగ్ పెట్టిండు
– రిజర్వేషన్ల సాధనకు కృషిచేస్తా
– కాంగ్రెస్, బీజేపీలు దెందూదెందే
– నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ప్రభుత్వం రావాలి
– అందుకు తెలంగాణ ప్రజల మద్దతు అవసరం
– మహబూబాబాద్ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్
మహబూబాబాద్, నవంబర్23(జనంసాక్షి) : తెలంగాణ కోసం ఏవిధంగానైతే పోరాడామో.. అదే విధంగా పోరాడి రిజర్వేషన్లను సాధించిపెడతానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హావిూనిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మహబూబాబాద్ గిరిజన ప్రాంతమని, తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలని గిరిజనులు దశాబ్దాలుగా పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. మా తండాలలో మా రాజ్యం కావాలని అడిగితే ఏ ప్రభుత్వం చేయలేదని, తెరాస
అధికారంలోకి రాగానే తండాలను పంచాయతీలుగా చేశామన్నారు. రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేశామని, శాసనసభలో ఆమోదింపజేశామని, రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాల్సి ఉందదన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి మతపరమైన పిచ్చి ఉందని, ముస్లింలతోపాటు గిరిజనుల రిజర్వేషన్ల అంశాన్ని కూడా పెండింగ్ పెట్టారన్నారు. కేసీఆర్ ఏదైనా పట్టుబడితే సాధించి తీరుతాడని స్పష్టం చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా, బీజేపీ వచ్చినా..దొందూదొందేనని ఎద్దేవా చేశారు. ఇద్దరిలో ఏం తేడా ఉండదని, అధికారాలన్నీ వారి చేతిలో ఉండి, రాష్ట్రాల విూద కర్ర పెత్తనం చలాయించే సంస్కృతి వాళ్లదన్నారు. ప్రజల కోరికలు నెరవేరాలే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం నడవాలంటే..ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ప్రభుత్వం రావాలని కేసీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న 17స్థానాలు మొత్తం గెలిచి, ఢిల్లీలో పోరాటం చేసే పరిస్థితి ఉండాలని, అది విూ చేతుల్లోనే ఉందన్నారు. విూరు ఆ అధికారం ఇస్తే వందకు వందశాతం ఎస్టీ రిజర్వేషన్ తెచ్చి ఇచ్చే బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. త్వరలో 3500 మందికిపైగా గిరిజనులు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాబోతున్నారని కేసీఆర్ అన్నారు. మహబూబాద్ జిల్లాలో త్వరలో 80 మంది గిరిజనులు సర్పంచులు కాబోతున్నరని చెప్పారు. ప్రతీ తండాలో ఎన్నికలపై చర్చ జరగాలన్నారు. మానుకోట జిల్లాలో పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వచ్చిన ఆరునెలల్లో పరిష్కారం చేస్తమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఉన్నతాధికారులను స్వయంగా ఈ ప్రాంతానికి తీసుకువచ్చి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామనీ కేసీఆర్ అన్నారు. ఇపుడు ఎన్నికల్లో ఉన్నవారు అంతా పాతవాళ్లేనని, విూకు తెలిసినోళ్లేనని ఎవరు ఏం చేశారో తెలుసుకుని ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కాలువల్లో తుమ్మలు మొలిచియని, అన్ని కాల్వలోకి నీళ్లు తెచ్చే బాధ్యత టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతుబీమా చాలా అద్భుతమైన పథకమని, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నామన్నారు. ఇప్పుడు ఇస్తున్న రూ. వెయ్యి పెన్షన్ రెండింతలు చేస్తున్నామని, రైతు బంధు పథకం ఏడాదికి రెండు పంటలకు కలిపి రూ.10 వేలు ఇస్తమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే వాళ్ల అయ్య ముల్లె పోయినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాకపోతే..కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే మానుకోట జిల్లా కేంద్రం కాకపోయేదన్నారు. బలరాంనాయక్ అనే పుణ్యాత్ముడు ఎంత గొప్పోడంటే.. కాంగ్రెస్ ఓటేయకుంటే మళ్లీ ఆంధ్రాలో కలుపుతామన్నాడని అన్నారు. బలరాం నాయక్ నోటికి ఆ మాట ఎట్లా వచ్చిందని, బలరాం నాయక్ లాంటి చీమునెత్తురు లేనివాళ్ల పుణ్యంతోనే ఇంకా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా నాయకుల సంచులు మోస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.