మోదీ దమ్ముంటే చర్చకు సిద్ధమా?


– ప్రధాని స్థాయిలో ఉండి అసత్యాలు మాట్లాడటం తగదు
– ప్రాజెక్టులను అడ్డుకొనే బాబుకు గుణపాఠం చెప్పాలి
– ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు
– మహబూబ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌
మహబూబ్‌నగర్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : దేశానికి ప్రధాని అయిన మోదీకూడా అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్యపెట్టే పని చేయడం చూస్తుంటే సిగ్గేస్తుందని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నిజామాబాద్‌ పర్యటనలో ఉన్నాడని, అక్కడ కేసీఆర్‌ విద్యుత్‌ ఇవ్వలేదు, నీళ్లివ్వలేదని మాట్లాడారని అన్నారు. మోడీని ఒక్కటే అడుగుతున్నానని.. నిజామాబాద్‌ అభివృద్ధిపై మోడీ సిద్ధమా అని సవాల్‌ విసిరారు. మోడీ అక్కడే ఉంటే నేను వెంటనే నిజామాబాద్‌ వస్తానని, నిజామాబాద్‌లో ఏం అభివృద్ధి జరగలేదో ప్రజల ముందే తేల్చుకుందాని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సమస్య ఎక్కడిది అని ప్రశ్నించారు. మోదీ ఇంత తెలివితక్కువ ప్రధాని అని అనుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ అసత్యాలు మాట్లాడటం సరికాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికలు ఆషామాషీవి కావని, మరోవైపు ఏ చంద్రబాబు అయితే ఈ జిల్లాను తొమ్మిదేళ్లు దత్తత
తీసుకొని ఎడారిగా మార్చేసిండో.. ఆయన మద్దతుదారే ఇక్కడే పోటీలో ఉన్నాడని అన్నారు. మహబూబ్‌ నగర్‌ కు సాగునీరు రానియ్యను అని శపథం చేస్తున్న చంద్రబాబు పార్టీ అభ్యర్థి డిపాజిట్లు గల్లంతు చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వలస అధిపత్యం చెల్లదు అని ఈ ఎన్నికల ద్వారా నిరూపించాలన్నారు. పొరపాటున టీడీపీ అభ్యర్థి గెలిపిస్తే ఇజ్జత్‌ పోతదని, పరాయి పెత్తనం కిందకు మళ్లీ పాలమూరు పోవద్దని కేసీఆర్‌ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల కట్టొద్దని ఈ జిల్లా కాంగ్రెస్‌ నేతలే 50 కేసులు వేశారని, నేను చెప్పేదే అబద్ధమైతే డిపాజిట్‌ రాకుండా ఓడగొట్టండి.. నిజమైతే అవతల అభ్యర్థికి డిపాజిట్లు రాకుండా చేయండి అంటూ పిలుపునిచ్చారు.  ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మ గౌరవానికి పరీక్ష అని కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గంలో 3700ల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించామని, ఉద్యమ సమయంలో శ్రీనివాస్‌ గౌడ్‌ క్రియాశీలకంగా పని చేశాడని కేసీఆర్‌ అన్నారు. ఈ ఇండ్లలో పైరవీలు లేవని, కాంగ్రెసోళ్లు కట్టించిన ఇండ్లలో అవినీతి, అప్పులేనని అన్నారు. ఆ అప్పులను టీ ఆర్‌ ఎస్‌ ప్రభుత్వం మాఫీ చేసిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టించే ఇండ్లను ఒక్క రూపాయి తీసుకోకుండా కట్టించినం అన్నారు. రెండు తరాలకు ఉపయోగపడే విధంగా ఇండ్లను నిర్మించామని, అన్నీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విూ ముందున్నాయన్నారు. అందుకే ఆలోచించి న్యాయం వైపు అడుగులు వేయాలని కేసీఆర్‌ కోరారు.