మోదీ పతనం మొదలైంది
కేజ్రీవాల్ ప్రజల పక్షమే ఉండాలి
అన్నా హజారే ఆకాంక్ష
రాలెగాంవ్‌సిద్ధి, ఫిబ్రవరి 10(జనంసాక్షి)- ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజీవ్రాల్కు సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే శుభాకాంక్షలు తెలిపారు. మొదటసారి కేజీవ్రాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఉద్యమాలను కూడా మర్చిపోవద్దని హజారే పేర్కొన్నారు.ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నా హజారే వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ నల్లధనాన్ని తీసుకొస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. ఇది నరేంద్ర మోదీ ఓటమి అని హజారే అన్నారు. ఈ ఓటమి కిరణ్‌బేడీది కాదని, ప్రధాని మోడీ ఓటమి అని పేర్కొన్నారు. గతంలో మార్పు కోసమే మోడీకి ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ పని చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనాన్ని తెచ్చి కుటుంబానికి ప్రజలకు రూ. 15 లక్షలు ఇస్తామన్న బీజేపీ రూ. 15 కూడా ఇవ్వలేదని అన్నారు.