మోదీ పనితీరుకు ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఇచ్చిన‌ రాహుల్‌ గాంధీ..

దిల్లీ(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీ పనితీరుకు ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఇచ్చారు. నాలుగేళ్ల మోదీ పాలనకు ఆయన ‘ఎఫ్‌’ గ్రేడ్‌ ఇచ్చారు.

నాలుగు సంవత్సరాల్లో మీ పనితీరు..
‘వ్యవసాయం రంగంలో విఫలమయ్యారు. విదేశీ విధానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందారు. చమురు ధరల నియంత్రణలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగాల కల్పన పనితీరులో అనుత్తీర్ణులయ్యారు. మీ సొంత సిద్ధాంతాలను సృష్టించడంలో మీరు ‘ఏ ప్లస్‌’ గ్రేడ్‌ సాధించారు. సెల్ఫ్‌ ప్రొమోషన్‌లోనూ మీకు ‘ఏ ప్లస్‌’, యోగాలో ‘బీ మైనస్‌’.

రిమార్క్స్‌‌: మంచి సంభాషణ నైపుణ్యం ఉంది. మీ పాలనలో ప్రజలు ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలపై మీకున్న ఏకాగ్రత చాలా తక్కువ.’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

మరోపక్క భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటోంది. అంతేకాకుండా 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాల గురించి ప్రజలకు తెలిసే విధంగా ఈనెల 27నుంచి భాజపా ప్రచారం ప్రారంభించనుంది.