మోషెన్‌రాజు మనస్తాపం- దళితులలో అగ్రహం
ఏలూరు, జూలై 27 :జిల్లాకాంగ్రెస్ అధ్యక్షపదవిని సైతం వదులుకొని మహానేత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి పై అభిమానంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన మోషెన్‌రాజును జిల్లా పార్టీ కన్వీనర్ పదవినుంచి అర్థాంతరంగా తొలగించటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సుబ్బారెడ్డితో భేటీ ముగిశాక జగన్ నిర్ణయాన్ని తెలుసుకున్న మోషెన్‌రాజు పార్టీ కార్యాలయం నుంచి ఆగ్రహంతో వెళ్ళిపోయారు. మరోవైపు దళిత వర్గాలకు చెందిన మోషెన్‌రాజు తొలగింపుపై జిల్లాలోని ఆ వర్గం నేతలు జగన్ తీరుపై మండిపడుతున్నారు. నర్సాపురం, పోలవరం ఉపఎన్నికలు జరిగేవరకు దళితులను ఓట్ల కోసం వాడుకుని ఇప్పుడు ఎన్నికలు ముగిశాక తొలగించారని, జగన్ వైఖరి దళితులను కరివేపాకులా వాడుకున్నట్టు ఉందని భీమవరం, నర్సాపురం ప్రాంతానికి చెందిన కొందరు దళిత నేతలు మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి దళితులను అందలం ఎక్కిస్తే అందుకు భిన్నంగా జగన్‌మోహన్‌రెడ్డి దళితులను అణగదొక్కుతున్నారనే ఆరోపణలు రాజు ఉదంతంతో మిన్నంటాయి. రాజును పదవి నుంచి తొలగించటం వెనుక కారణాలు చెప్పాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపించిన రాజు కృషిని, కష్టాన్ని గుర్తించకుండా ఆయన్ను పదవినుంచి తొలగించి దళిత మనోభావాలను దెబ్బతిశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కాపు సామాజిక వర్గం నేతల మాటలకు విలువనిచ్చిన జగన్ దళిత బిసీలను చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న మాజీ మంత్రి చేెగొండి హరిరామ జోగయ్య, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, శాసనమండలి సభ్యుడు మేక శేషుబాబు తదితరులు మోషెన్‌రాజు తొలగింపు చర్యను తీవ్రంగా తప్పు పడుతున్నారు.