మోసం చేసేందుకు టీడీపీ, బీజేపీ మళ్లీ వస్తున్నాయి.. జాగ్రత్త

– జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు
– నాలుగేళ్లుగా అవినీతి పాలనతో రాష్ట్రాన్ని తెదేపా భ్రష్టు పట్టించింది
– వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
– అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో వంచన గర్జన దీక్ష
అనంతపురం, జులై2(జ‌నం సాక్షి) : తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు నాలుగేళ్ల పాటు ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురంలో జరుగుతున్న వంచన గర్జన దీక్షలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. నాలుగేళ్లపాటు రాష్టాన్ని వంచించిన పార్టీలు మళ్లీ మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ¬దా కోసం దీక్షలు, ఉద్యమాలు చేసిన వారిపై కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక ¬దా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే తెలుగుదేశం నేతలు దొంగదీక్షలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు టీడీపీని దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. విభజన హావిూలను నెరవేర్చకుండా టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు మోసం చేశారని ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా టీడీపీ అవినీతి పాలన చేస్తుందని అన్నారు. చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కులను చంద్రబాబు కాలరాశారని బొత్స మండిపడ్డారు. విభజన హావిూల అమలుకై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన హావిూల అమలు కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం, బీజేపీలు చేసిన మోసాలపై ప్రజలకు అప్రమత్తం చేయడానికే వంచనపై గర్జన దీక్ష చేపట్టినట్లు చెప్పారు
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం – మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం హావిూలు ఇచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు ఎన్నో హావిూలు ఇచ్చారన్నారని.. ప్రత్యేక ¬దాతో పాటు 7 వెనుకబడ్డ జిల్లాలను ఆదుకుంటామన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోందన్నారు. అనంతలో అత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇచ్చి ఉంటే రాయలసీమ ఈ పాటికి అభివృద్ధి చెంది ఉండేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ
ఎంపీలు రాజీనామాలు చేశారని, ఆమరణ దీక్షలు చేశారన్నారు. హంద్రీనీవా ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు వేగంగా జరిగాయన్నాయన్నారు. ఈ పోరాటం అధికారం కోసం కాదని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్‌సీపీకి ముఖ్యమని వివరించారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తే వారిని తెలుగుదేశం పార్టీ భౌతికంగా తుదిముట్టించిందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, పోరాటాలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
దుష్టపాలనను తరిమేందుకు నడుంబిగిద్దాం – వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌
రాష్ట్రంలోచంద్రబాబు దుష్టపాలనకు అంతం పలికేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షలు రేషన్‌ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించార’ని విమర్శించారు. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఈయన ముఖ్యమంత్రా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబును ‘పీకే ముఖ్యమంత్రి అనొచ్చు’ అంటూ ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలోనైనా ఈ జన్మభూమి కమిటీలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఒక పిరికిపంద అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అనిప్రశ్నించారు.  ముగ్గురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. విభజన చట్టాన్ని చంద్రబాబుకు సత్తా ఉంటే అమలు చేయించాలి లేదంటే మిన్నకుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.