యంత్రాల వాడకంతో కూలీల.. 

కొరతను అధిగమించవచ్చు
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేసీఆర్‌ లక్ష్యం
– రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
– పొలాసలో నూతన వరినాట్ల యంత్రాల క్షేత్రస్థాయి ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి, ఎంపీ కవిత
జగిత్యాల, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి ) : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, ఆమేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం పొలాసలోని ప్రొ.జయశంకర్‌ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయంలో నూతన వరినాట్ల యంత్రాల క్షేత్రస్థాయి ప్రదర్శనకు ఎంపీ కవితతో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. వ్యవసాయంలో కూలీల కొరత నేటి రైతాంగాన్ని వేధిస్తోందని, యంత్రాల వాడకంతో కూలీల కొరతను అధిగమించొచ్చనన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. తెలంగాణలో 25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని, 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందన్నారు. తెలంగాణలో కోటి 50 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నట్లు చెప్పారు. కూలీల కొరత నివారించేందుకు వ్యవసాయంలో యాంత్రీకరణ ముఖ్యమన్నారు. వరి నాటు యంత్రాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతులకు నచ్చిన కంపెనీ యంత్రాలు కొనుక్కోవచ్చునని పోచారం పేర్కొన్నారు. యంత్రాలతో నాటువేస్తే ఎకరానికి రూ.2 వేల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. దేశంలోనే వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పోచారం పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకొనేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రైతులకు సాగులో సూచనలు ఇచ్చేందుకు రైతు సమితుల ఏర్పాటు, ఖరీఫ్‌, రబీ ప్రారంభంలో పెట్టుబడి ఖర్చులకోసం ఇబ్బందులు పడకుండా ఎకరాకు రూ.4వేలు చొప్పున అందజేత, రైతుల కుటుంబాల్లో భరోసా నింపేందుకు రైతు బీమా పథకం వంటి పథకాలను అమలు చేయటం జరిగిందన్నారు. రైతులు సాగులో ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి రైతులను వెన్నుదన్నుగా తెరాస ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో మరిన్ని పథకాలను అమలు చేసి రైతులు రాజులుగా బతికేలా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తమ అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతుందోననే భయంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవాకులు
చవాకులు పేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.