యధాతధంగా ‘నీట్‌’

1

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఝలక్‌ ఇచ్చింది. నీట్‌ నిర్వహించాల్సిందేనని తేల్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు నడుచుకోవాలని సూచించింది.  వైద్య విద్య సీట్ల భర్తీకి జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్‌)పై పునఃసవిూక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌పై ఇచ్చిన ఆదేశాలను పునఃసవిూక్షించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన జస్టిస్‌ అనిల్‌ దవేతో కూడిన ధర్మాసనం మే 1న జరిగే నీట్‌ పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నీట్‌పై తాము ఇచ్చిన ఆదేశాలు తప్పక పాటించాల్సిందేనని ధర్మాసనం సూచించింది. నీట్‌ పరీక్షపై అభ్యంతరాలను పరిశీలించాలని శుక్రవారం ఉదయం కేంద్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని కోర్టును అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్‌గీ కోరారు. ఇప్పటికిప్పుడు పరీక్షను హిందీ, ఇంగ్లీషులో రాయడం కష్టమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని మెడికల్‌ కళాశాల్లో ఎంబీడీఎస్‌, బీడీఎస్‌, పీజీ కోర్సుల్లో నీట్‌ ద్వారానే ఇంకనుండి ప్రవేశాలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ఇండియా, సీబీఎస్‌ఈలు మే 1న జరిగే పరీక్షను తొలిదశగా పరిగణించాలని, జులై 24న రెండోదశ ఎగ్జామ్‌ నిర్వహించాలని కోర్టు తెలిపింది. ఆగస్ట్‌ 17 లోగా నీట్‌ ఫలితాలు వెల్లడించాలని, సెప్టెంబర్‌ 30 కల్లా కౌన్సిలింగ్‌ పూర్తి చేయాలని పేర్కొంది. ఫలితాలు వచ్చిన 45 రోజుల్లోగా…అంటే అక్టోబర్‌ 1 నుండి తరగతులు ప్రారంభం కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నీట్‌ కు వ్యతిరేకంగా తమిళనాడు, యూపీతోపాటు కర్ణాటక మెడికల్‌ కళాశాల అసోసియేషన్లు 2013 కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా 400ల మెడికల్‌ కాలేజీల్లో 52 వేల సీట్లకు ప్రతీ ఏడాది వేర్వేరు పద్ధతుల్లో ఎంట్రన్స్‌ పరీక్షలు జరుగుతున్నాయి.మెడికల్‌, డెంటల్‌ కోర్సుల కోసం దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్‌పై మధ్యంతర ఉత్తర్వులు పునఃసవిూక్షించాలని జస్టిస్‌ దవేను ఏజీ, న్యాయవాదులు కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్టాల్ల్రో ప్రవేశ పరీక్షలపై స్టే ఇవ్వలేదని ఏజీ జస్టిస్‌ దవేకు తెలిపారు. స్టే ఇవ్వనందున ఎంసెట్‌ ప్రవేశ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తెలిపారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే ప్రవేశ పరీక్ష పూర్తయిందని రోహత్గీ చెప్పారు. తీర్పు అమలు నిలిపివేసి మరో ధర్మాసనం నియమించి వాదనలు వినాలని రోహత్గీ కోరారు. ఇప్పటికిప్పుడు పరీక్షను హిందీ, ఆంగ్లలో రాయడానికి ఇబ్బందులు ఉన్నాయని రోహత్గీ వెల్లడించారు. నిన్నటి ఉత్తర్వులను పునఃసవిూక్షించాలని అటార్నీ జనరల్‌ కోరారు. కొత్త ధర్మాసనం నియమించిన వినాలని అటార్నీ జనరల్‌, న్యాయవాదులు కోరారు. అయితే నిన్న ఇచ్చిన తీర్పునే ఫాలో కావాలని, ఇందులో పునరాలఅఓచన లేదని కోర్టు తెలియచేసింది. దీంతో ఉమ్మడి పరీక్ష నీట్‌ తప్పనిసరి కానుంది. అయితే నీట్‌ పరీక్షపై తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందవద్దని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ సూచించారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సిఎం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.