యాంటీ టెర్రర్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం

అహ్మదాబాద్ : వివాదాస్పద యాంటీ టెర్రర్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో కూడా గుజరాత్ అసెంబ్లీ మూడుసార్లు బిల్లును పాస్ చేసింది. కానీ మూడు సార్లు ఈ బిల్లును ఆయా రాష్ట్రపతులు తిరస్కరించారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రపతులు ఈ బిల్లును తిరస్కరించారు. పదేళ్లుగా ఈ బిల్లు కేంద్రంలో ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు కేంద్రంలో పూర్తి మెజార్టీ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో యాంటి టెర్రర్ బిల్లుకు త్వరలోనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఈ బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆనాడు బిల్లు పాస్ అయింది కానీ రాష్ట్రపతులు తిరస్కరించారు.

గుజరాత్ తీవ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో యాంటి టెర్రర్ బిల్లును ఆ రాష్ట్రం అసెంబ్లీలో పాస్ చేసింది. సముద్ర సరిహద్దుపరంగా చూస్తే గుజరాత్‌కు 1600 కిలోమీటర్ల దూరంలో, భూ సరిహద్దుపరంగా చూస్తే 500 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ ఉంది. అక్షరధామ్, పార్లమెంట్ దాడి, ముంబయి దాడులు, రఘునాత్ ఆలయంపై తీవ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.