యాదవుల పెళ్లిసందడి
లక్నో,ఫిబ్రవరి21(జనంసాక్షి): సమాజ్‌వాదిపార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మనవడి వివాహ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైయ్యారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజలక్ష్మీ, ములాయం మనవడు తేజ్ ప్రతాప్‌సింగ్ యాదవ్‌కు ఈ నెల 26న ఢిల్లీలో వివాహం జరగనుంది. ములాయం ఆహ్హానం మేరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్‌తో కలిసి ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. మోదీ ఈ వేడుకలో ములాయం, లాలూ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా 45 నిమిషాలపాటు గడిపారు. ములాయం, లాలూ ఇరువురి మధ్యలో కూర్చొని ఫోటోలకు ఉత్సాహంగా ఫోజులిచ్చారు. అనంతరం ములాయం మాట్లాడుతూ… ప్రధాని రాకలో ఎటువంటి రాజకీయ అంశాలు లేవు. మర్యాదపూర్వకంగానే నూతన వరుడికి ఆశీస్సులను అందించారు. ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ప్రధానికి మా కృతజ్ఞతలని అన్నారు. లాలూ ప్రసాద్‌యాదవ్ మాట్లాడుతూ.. మా ఇరువురి మనసుల కలయికతో ఈ పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నయాపైసా కట్నం కూడా తీసుకోకుండా ములాయం ఈ వివాహ వేడుకను జరిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ప్రసాద్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం నారాయన్ దత్ తీవారీ, సమాజ్‌వాదీపార్టీ మాజీ లీడర్ అమర్‌సింగ్, బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌లతో పాటు ఇతర రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ వేడుకకు హాజరైయ్యారు.