యాదిరెడ్డి నీ త్యాగం వృధాకాదు

నీ యాదిలో తెలంగాణ సాధిస్తాం
తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలే
ఏపీభవన్‌కు యాదిరెడ్డి బౌతికకాయాన్ని రాయియ్యలేదు
ఎక్కడ లేచి జైతెలంగాణ అంటాడో అని భయపడ్డారు
హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలో పార్లమెంట్‌ ఎదుట ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మొదటి సంస్మరణ సభను టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు హాజరైన విద్యార్థులు యాదిరెడ్డి త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్‌ఎస్‌ శాసన సభ పక్ష నేత ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ స్థాయిలో తన ప్రాణాలను బలిచ్చి చాటిన అమరవీరుడు యాదిరెడ్డి అని కీర్తించారు. యాదిరెడ్డి చేసిన అంత గొప్ప త్యాగాన్ని వృథా కానివ్వమని, అతని యాదిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, ఆఖరికి తమ ఆకాంక్ష కోసం అమరులైనా, పాలకులు వారి మృతదేహాలను కూడా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్‌లోకి రానివ్వక పోవడమే నిదర్శమన్నారు. పాలకులు యాదిరెడ్డిది సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చివరి వరకు కుట్రలు చేశారని, కానీ, తెలంగాణవాదులు ఆ కుట్రలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందేనని ఈటెల గుర్తు చేశారు. ఏపీ భవన్‌లోకి మృతదేహాన్ని అనుమతిస్తే, ఎక్కడ యాదిరెడ్డి లేచి ‘జై తెలంగాణ’ అంటాడోనని అక్కడి సీమాంధ్ర అధికారులు భయపడ్డారని ఎద్దేవా చేశారు. యాదిరెడ్డి ఏ ఆశయం కోసం అమరుడయ్యాడో, దాన్ని తెలంగాణ యువత మరువకూడదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చేదాకా పోరాడుతూనే ఉండాలని పిలుపునిచ్చారు. అమరుల సంస్మరణ సభలు నిర్వహించుకోవడం కాదు, వారి ఆశయాలను సాధించడమే వాళ్లకు మనమిచ్చే నిజమైన నివాళి అని సందేశమిచ్చారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సాధించి యాదిరెడ్డికి నిజమైన ఘన నివాళి అర్పిద్దామని ప్రతిన బూనాలన్నారు. యాదిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, అతని తమ్ముడికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని ఈటెల హామీ ఇచ్చారు. ఈ మధ్య సీమాంధ్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాల్చి చంపాల్సింది అధికారులను కాదు.. తెలంగాణకు అడ్డుపడుతున్న వారిని, తెలంగాణకు ద్రోహం చేస్తున్న వారినని పరోక్షంగా సీమాంధ్ర నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు చురకనంటించారు. యాదిరెడ్డి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైన నాయకుల భరతం పడతామని, త్వరలోనే తెలంగాణ ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు.