యాప్‌ల ద్వారా లోన్‌ ప్రమాదం – ఆర్‌బీఐ

 

ముంబయి,డిసెంబరు 23 (జనంసాక్షి):ఆన్‌లైన్‌ దా’రుణ’ యాప్‌ల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పందించింది. తెలంగాణ సహా దేశంలో పలుచోట్ల రుణ యాప్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అలాంటి యాప్‌ల ఉచ్చులో పడొద్దని, వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు సూచించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) యోగేశ్‌ దయాల్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, చిన్న వ్యాపారులు ఈ యాప్‌లకు ఆకర్షితులు అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీజీఎం పేర్కొన్నారు. తీరా రుణాలు ఇచ్చాక అధిక వడ్డీ, హిడెన్‌ ఛార్జీల పేరిట అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నాయని, అంతేకాకుండా ముందస్తుగా కుదిరిన ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తూ రుణ గ్రహీతల ఫోన్ల నుంచి వ్యక్తిగత డేటాను వినియోగించడం ఆమోద యోగ్యం కాదన్నారు. యాప్‌ల మోసాలపై ఆర్‌బీఐకి చెందిన వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని యోగేశ్‌ దయాల్‌ సూచించారు. ప్రజలు కేవలం ఆర్‌బీఐ వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలన్నారు. అలాగే ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీల డిజిటల్‌ రుణ యాప్‌లు సైతం గుర్తింపు వివరాలను వినియోగదారుల ముందుంచాలని సూచించారు. గుర్తింపు పొందిన రుణ యాప్‌లపై ఫిర్యాదుల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.మరోవైపు ఆన్‌లైన్‌లో రుణం ఇస్తామంటూ వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. దిల్లీలో ఐదుగురు, హైదరాబాద్‌లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. హైదరాబాద్‌, దిల్లీ, గురుగ్రామ్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నాలుగైదు నెలల క్రితం పక్కా ప్రణాళికతో రుణాలిచ్చే యాప్‌ల సేవలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని బేగంపేట, పంజాగుట్ట ప్రాంతాల్లో మూడు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. సీసీఎస్‌ పోలీసులు దిల్లీ, హైదరాబాద్‌లలో చేపట్టిన దాడుల్లో నిందితులను అరెస్ట్‌ చేశారు.