యువతకు ఉపాధి కల్పించాలి : గుండా
ఆదిలాబాద్,జూన్22(జనం సాక్షి ): ఉపాధి దొరకక యువత వలసలు వెళ్తున్నారని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గంగా జిల్లాలో మూసిన ఎస్పీఎం కాగితపు, సిమెంటు పరిశ్రమలు వెంటనే తెరిపించాలని సీపీఐ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడుభూములకు పట్టాలివ్వడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. హరితహారంలో పోడుభూములను లాక్కోవడం సరికాదన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే సమస్యలు పరిస్కారం కావడం బదులు పెరిగాయని గుండా మల్లేశ్ అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో ఎందుకు వెనక్కి పోయారో చెప్పాలన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని, కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు.ఎన్నికల ముందు తెరాస ఎన్నో హావిూలు గుప్పించిందని, తీరా అధికారంలోకి వచ్చాక కాలక్షేపానికే పరిమితమైందని అన్నారు. ఏ రంగంలో పని చేస్తున్న కార్మికులకైనా నెలకు రూ.18 వేల వేతనం నిర్ణయించి అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండు చేస్తుంటే.. రూ.10 వేలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి పేర్కొనడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధుల వేతనాలను రూ.లక్షల్లో పెంచుతున్న పాలకులు కార్మికుల వేతనాలను పెంచేందుకు వెనకాడటం దుర్మార్గమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్యకర్తలకు వేతనాలను పెంచాలని కోరారు. పెట్టుబడి దారులకు అనుకూలంగా చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలన్నారు.