యూపి బిజెపిలో బయటపడుతున్న లుకలుకలు

యోగిని సిఎం చేయడం తప్పన్న మంత్రి రాజ్‌భార్‌

మౌర్యను సిఎం చేసివుంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్య

లక్నో,జూన్‌4(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌ బిజెపిలో లుకలుకలు మెల్లగా బయటపడుతున్నాయి. ఇటీవలి ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో సిఎం యోగిపై ఉన్న అసంతృప్తి మెల్లగా బయటకు వస్తోంది. తాజాగా ఓ మంత్రి బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను నియమించడం పట్ల ఓబీసీలు ఆగ్రహంతో ఉన్నారని.. అందుకే ఉప ఎన్నికల్లో భాజపా ఓడిపోయిందని రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భార్‌ అన్నారు. భాజపా సీనియర్‌ నేత కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను ముఖ్యమంత్రిగా నియమించకపోవడం పట్ల వెనుకబడిన వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, ఆయనను కాకుండా యోగిని సీఎంగా చేయడంతో వారు భాజపాకు వ్యతిరేకంగా ఓట్లేశారని ఆయన పేర్కొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా.. కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను మొదట సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసింది. కానీ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మౌర్య సీఎం అవుతారనే ఆశతో వెనుకబడిన వర్గాలు భాజపాకు ఓటేశాయి. వారి ఆగ్రహం వల్లే ఈ ఉప ఎన్నికల్లో భాజపా ఓడిపోయింది’ అని సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత, కేబినెట్‌ మంత్రి అయిన రాజ్‌భార్‌ విూడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో భాజపా ఓటమికి యోగి ఆదిత్యనాథే బాధ్యుడా? అని అడిగిన ప్రశ్నకు ‘ఓటమికి బాధ్యత ప్రభుత్వానిది. ఓటమికి గల కారణాలపై భాజపా పునఃపరిశీలించుకోవాలి. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే అంశం భాజపాకు సంబంధించిన అంశం. యోగిని లేదా కేశవ్‌ను సీఎం చేసే అంశం పార్టీకి సంబంధించినది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కైరానా లోక్‌సభ, నూర్‌పూర్‌ అసెంబ్లీ స్థానాల్లో భాజపా ఓడిపోయిన సంగతి

తెలిసిందే. కైరానాలో రాష్టీయ్ర లోక్‌ దళ్‌ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ భాజపా అభ్యర్థిపై 44,618ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నూర్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి 5,662 మెజార్టీతో గెలుపొందారు. కైరానాలో తబస్సుమ్‌కు కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీలు కూడా మద్దతిచ్చాయి.