యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్?
– సోనియాతో చర్చలు
న్యూఢిల్లీ,జూన్ 16(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని వెతుక్కునే పనిలో పడ్డాయి. బిజెపి ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించగా కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టింది. బిజెపిలో అనేకమంది సిఎం పదవికి పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఇప్పుడు దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై షీలా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలవనున్నారు. కాంగ్రెస్ కూడా షీలాను ముఖ్యమంత్రి అభ్యర్థిని చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాకు యూపీలో ప్రధాన ప్రచారకర్త బాధ్యతల్ని అప్పగించాలని పార్టీ భావిస్తోందని తెలిపాయి. ఇప్పటికే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భాజపాలు పోటాపోటీగా ఎన్నికలకు సిద్ధమవుతుంటే వారికి దీటుగా కాంగ్రెస్ పోరులో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. బ్రాహ్మణ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా యూపీ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని ఎన్నికల స్టాట్రజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలతో కాంగ్రెస్ ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించినట్టు వార్తలొస్తున్నాయి. ఈమేరకు షీలా దీక్షిత్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని సమాచారం. కాగా, యూపీ, పంజాబ్ రాష్టాల్ల్రో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు కీలకం కానున్నాయి. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కమల్ నాథ్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఆమె నియమించే అవకాశముందని విూడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు షీలా దీక్షిత్ నిరాకరించారు. పంజాబ్ ఇంచార్జిగా ఉండేందుకు కమల్ నాథ్ విముఖత చూపారు. కాగా, యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్ పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెర తీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ‘ఎన్నికలకు ముందు మా వ్యూహాన్ని, అభ్యర్థిని ప్రకటిస్తాం’ అని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఇంతకుముందే తెలిపారు.