యూరోపియన్‌ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

2

– ఈ ఘటనతో మేలుకోవాలి

బెర్లిన్‌,మే31(జనంసాక్షి):మధ్యధరా సముద్రంలో ఇటీవల వలసదారుల పడవ మునిగిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీకి చెందిన రెస్క్యూ సిబ్బంది వలసదారుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. ముక్కు పచ్చలారని ఆ చిన్నారి మృతదేహాన్ని చూసి చలించిపోయారు. ఈ హృదయవిదాకరమైన ఘటన మనసును కలిచివేసింది. దీనిపై సీ-వాచ్‌ అనే స్వచ్ఛంద సంస్థ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికైనా యూరోపియన్‌ నేతలు కళ్లు తెరవాలని.. ఈ ఘటన వారికి మేలుకొలుపు కావాలని పేర్కొంది. వలసదారులు ప్రాణాలు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని డిమాండు చేసింది. ఇప్పటికైనా సముద్రంలో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్న వలసదారుల భద్రతపై ఈయూ నేతలు స్పందించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది.గత ఏడాది సిరియా వలసదారుల పడవ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అయిలాన్‌ కుర్ది మృతదేహం టర్కీ తీర ప్రాంతానికి కొట్టుకువచ్చింది. ఆ ఘటన యావత్‌ ప్రపంచాన్నే కలచివేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ ప్రమాదాలను అరికట్టాలని వలసదారులు విదేశాల్లోకి వచ్చేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి రాకకు ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఈయూ వారిని ఆదుకోవాలని సీవాచ్‌ పేర్కొంటోంది. సిరియా, ఇతర దేశాల నుంచి పలువురు శరణార్థులు యూరప్‌ వస్తున్నారు. ఇప్పటి వరకు రహదారి, సముద్ర మార్గాల ద్వారా రెండు లక్షల మంది వచ్చారు.