రంజాన్‌ ఏర్పాట్లకు ఐదు కోట్ల విడుదల

1
– ఏర్పాట్లను పర్యావేక్షించిన డెప్యూటీ సీఎం

హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రంజాన్‌ వేడుకల కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పాతబస్తీలోని మక్కామసీద్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్‌ వేడుకల కోసం జిల్లాకు రూ.50లక్షల చొప్పున రూ.5కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. ఈ మొత్తాన్ని ఆయా జిల్లాలోని మసీదుల్లో మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తామన్నారు. మక్కామసీదు, అసెంబ్లీ ప్రాంగణంలోని మసీదులు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని, వాటి అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించే వెసులుబాటు ఉందన్నారు. రంజాన్‌ పర్వదినం సందర్భంగా తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చూసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట చార్మినార్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రీ, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తుశాఖ అధికారులు ఉన్నారు.