రంజాన్ ముబారక్
నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం
ముస్తాబైన మసీదులు
హైదరాబాద్, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేడు శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెలం తా ముస్లింలు కఠిన ఉపవాసలు దీక్షలు ఉం డి, దాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తారు. రోజూ చేసే ఐదు పూటల నమాజుతోపాటు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ముఖ్యంగా రంజాన్ మాసం ప్రారంభ సూచికగా నెలవంక కనబడగానే రోజూ ‘తరావీహ్’ అనే ప్రత్యేక నమాజు చేస్తారు. ఈ నమాజులో మొత్తం ఖురాన్‌ను ‘హాఫిజ్’ అనే మత బోధకుడు చదివితే, ముస్లింలంతా శ్రద్ధగా వింటారు. ఈ నెలలో చేసే ప్రతి మంచి కార్యానికి రెండింతల పుణ్యం దక్కుతుందని ముస్లింల నమ్మకం. నెల రోజులు ఉపవాస దీక్ష చేసే ముస్లింలు, మళ్లీ నెలవంక కనబడగానే రంజాన్ ముగిసిందని దీక్షలు విరమిస్తారు. తెల్లవారు జామున ఈద్ ఉల్ ఫిత్ర్ పేరిట రంజాన్ పండుగను జరుపుకుంటారు.