రవళి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు


-స్వగ్రామంలో అలముకున్న విషాదం
వరంగల్‌,మార్చి5(జ‌నంసాక్షి):రవళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రవళిని కడసారి చూసేందుకు రామచంద్రాపురానికి చెందిన ప్రజలు కాకుండా చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ఈ సందర్భంగా రవళికి అంతిమ వీడ్కోలు
పలికారు. కాగా పలువురు రవళిపై దాడి చేసిన ప్రేమోన్మాదిని వెంటనే ఉరితీయాలనిప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వారి వల్ల యువతులు, మహిళలు ధైర్యంగా బయటకు వెళ్లి తమ పనులను నిర్వహించుకోలేక పోతున్నారని, అన్వేష్‌ లాంటి దుర్మార్గులను పెట్రోల్‌ పోసి తగలబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలని, తద్వారా రవళి ఆత్మకు శాంతిచేకూరేలా చూడాలని కోరారు.  ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళి సోమవారం సాయంత్రం మృతిచెందింది. రవళి మృతదేహానికి మంగళవారం ఉదయం వైద్యులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రవళి మృతదేహాన్నిఆమె స్వగ్రామమైన వరంగల్‌ అర్బన్‌ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి తరలించారు.  రవళి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హావిూ ఇచ్చారు. పెట్రోల్‌ దాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. రవళిపై దాడి చేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మంత్రి మరోసారి హావిూ ఇచ్చారు. కేసు దర్యాప్తు కోసం వరంగల్‌ పోలీసులు గాంధీ ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. కాగా రవళి ప్రేమించలేదనే కోపంతో గతనెల 27న ఆమెపై అన్వేష్‌ అనే ప్రేమోన్మాది పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.