రవాణా రంగంలో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ

m6277bq5దేశ రాజధానిలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా రికార్డు
వివక్ష అంతు చూసి స్టీరింగ్‌ చేతపట్టిన ‘సరిత’

న్యూ ఢిల్లీ, మార్చి 28: త్రివిధ దళాల్లో మహిళా సైనికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, శారీరక శ్రమ కలిగిన ఉద్యోగాలు స్ర్తీలు చేయలేరన్న అపోహ మన సమాజంలో చాలానే ఉంది. అదే క్రమంలో రవాణా రంగంలో కూడా అతివల సంఖ్య చాలా తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి అపోహలన్నీ పటాపంచల్‌ చేస్తూ ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో తెలంగాణ ఆడపడుచు సరిత చరిత్ర సృష్టించింది. డీటీసీలో మొదటి మహిళా డ్రైవర్‌గా నియామకమైంది. శిక్షణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో బస్‌ డ్రైవర్‌గా విధుల్లో చేరనున్న ఈ తెలంగాణ ఆడపడుచు.. దేశంలోని అందరి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. డైవ్రర్‌ ఉద్యోగానికి స్ర్తీలు పనికి రారన్న అపోహను తుడిచిపెట్టేసింది.

సరిత జీవితాన్ని పరిశీలించినట్లైతే.. జీవితం సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో సరితకు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. ఆ కష్టాలే ఆమెను దేశ రాజధాని ఢిల్లీలో తొలి మహిళా డ్రైవర్‌గా తీర్చిదిద్దాయి. సరిత స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం. ఆమె తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం, అందరూ అమ్మాయిలే. సరిత వారందరిలోకి చిన్నమ్మాయి. అనుకోని పరిస్థితుల కారణంగా స్టీరింగ్‌ చేతపట్టిన సరిత మొదట ఇంటివద్దే ఆటో నడిపింది. ఆతరువాత హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బస్‌ డ్రైవర్‌గా పనిచేసింది. అయితే అక్కడి ఓ లెక్చరర్‌ ప్రోత్సాహంతో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. అక్కడ బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఢిల్లీలోని మహిళా డ్రైవర్ల సమావేశానికి ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ సీఎండీ హాజరవటం.. ఆమె జీవితాన్ని టాప్‌ గేరులోకి తీసుకెళ్లింది.

ఇకపోతే సరిత ఈ రంగంలోకి రావడం వెనుక అనేక కష్టాలు ఉన్నాయి. సరిత తల్లి మగ సంతానం కోసం తన భర్తకు స్వయంగా రెండో పెళ్లి చేయించింది. ఆ పెళ్లి వారి వంశానికి వారసుడిని ఇవ్వడం సంగతేమో కానీ, కుటుంబానికి పెద్దదిక్కైన సరిత తండ్రిని రెండో భార్య తనతో పాటుగా హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి ముగ్గురి కూతుళ్లకు పెళ్లి చేసిన సరిత తండ్రి.. ఆ తరువాత చేతులెత్తేశాడు. అంతలోనే మొదటి అక్క భర్త సైతం అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణకు గాను సరిత ఆయన ఆటోని తీసుకుని నడపటం ప్రారంభించింది. ఆ తరువాత సరిత చేతిలోని చక్రానికి తిరుగన్నదే లేకుండా పోయింది.

ఆటోనడిపే రోజుల్లోనే సరిత వివక్ష ఎదుర్కొంది. అమ్మాయి ఆటో నడపడం పరువు తక్కువ అంటూ పలువురు రరకాల వ్యాఖ్యలు చేశారు. అలాంటి వివక్ష మధ్యనే సరిత డీటీసీలో ఉద్యోగం సంపాదించింది. డీటీసీలో ఉన్న 12 వేల మంది ఉద్యోగుల్లో అత్యధికులు పురుషులే. అలాంటి సంస్థలో తనకు మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా అవకాశం రావడం సరితకు గర్వకారణమైంది. మరికొద్ది రోజుల్లో శిక్షణ ముగించుకొని సరిత ఉద్యోగంలో చేరనుంది. ప్రస్తుతం తన తల్లిదండ్రులను సరితనే పోషిస్తోంది.