రవి బొపారాకు

ఇంగ్లాండ్‌ సెలక్టర్ల పిలుపు

– జట్టులోకి తిరిగి వచ్చిన స్వాన్‌, బ్రెస్నన్‌

లండన్‌ : సొంతగడ్డపై జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ తమ జట్టును ప్రకటించింది. ఎస్సెక్స్‌ ఆల్‌రౌండర్‌ రవి బోపారాకు సెలక్టర్లు చాలా కాలం తర్వాత పిలుపునిచ్చారు. 15 మంది జాబితాలో బొపారా చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌ తర్వాత బొపారా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం సమ్మిత్‌ పటేల్‌ , ల్యూక్‌ రైట్‌ నిలకడగా రాణిస్తుండడంతో అతని కెరీర్‌ ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీ లాంటి మెగా ఈవెంట్‌కు జట్టులో అనుభవమున్న ఆటగాళ్ళుండాలని భావించిన సెలక్టర్లు అతన్ని ఎంపిక చేశారు. అటు మిగిలిన ఆటగాళ్ళ ఎంపికలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాయాలతో ఇబ్బంది పడుతోన్న గ్రేమ్‌ స్వాన్‌ , టిమ్‌ బ్రెస్నన్‌ కూడా చోటు దక్కించుకున్నారు. వీరు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండడంపై సందిగ్థత నెలకొన్నప్పటకీ… సెలక్టర్లు ఎంపిక చేయడం విశేషం. కాగా ఊహించినట్టుగానే కెవిన్‌ పీటర్సన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు. అతని స్థానంలో యార్క్‌షైర్‌ బ్యాటింగ్‌ స్టార్‌ జో రూట్‌ ఎంపికయ్యాడు. అటు వికెట్‌ కీపర్‌ మ్యాట్‌ ప్రియర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. జాస్‌ బట్లర్‌కు వన్డే జట్టులోకి అవకాశమిచ్చారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ , ఆస్టేల్రియాతో తలపడనుంది.