రసపట్టులో ఆసీస్‌-లంక తొలిటెస్ట్‌

¬బార్ట్‌, డిసెంబర్‌ 17: శ్రీలంక, ఆస్టేల్రియా మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌ ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగోరోజు ఆసీస్‌ ఆధిపత్యం కనబరిచింది. వికెట్‌ నష్టపోకుండా 27 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన కంగారూలు ధాటిగా ఆడారు. ఓపెనర్లు కొవాన్‌, వార్నర్‌ తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలన్న ఉధ్దేశంతో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. కొవాన్‌ 56, వార్నర్‌ 68 పరుగులకు ఔటయ్యాక.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. వాట్సన్‌, హ్యూజ్‌, వేడ్‌ తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరుకున్నారు. ఈ స్థితిలో కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌, మైక్‌ హస్సీ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో స్కోర్‌ 250 దాటింది. అయితే క్లార్క్‌ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడం ఆసీస్‌ను దెబ్బతీసింది. హస్సీ నిలకడగా ఆడినా మిగిలిన ఆటగాళ్ళు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆస్టేల్రియా రెండో ఇన్నింగ్స్‌కు 278 పరుగుల దగ్గర తెరపడింది. లంక బౌలర్లలో హెరాత్‌ 5, వెలిగెదరా 3 వికెట్లు తీసుకున్నారు. తర్వాత 393 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆరంభంలోనే తడబడింది. 47 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. దిల్షాన్‌ 11, కరుణారతనే 30 పరుగులకు ఔటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సంగక్కరా, జయ వర్థనేలు కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో ఆటముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్న లంక 328 పరుగులు చేయాల్సి ఉంది.