రాంమందిరానికి కట్టుబడ్డాం

1

– అమిత్‌షా

న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మథురలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేక పోతున్నారని షా ధ్వజమెత్తారు. అందువల్ల దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కీలక బిల్లులు చట్టసభల్లో  ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  ప్రస్తుతం అమలు చేస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, ముద్రా బ్యాంక్‌, తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. ఇదే విధంగా భారతదేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే రానున్న రెండేళ్లలోనే ఆర్థికాభివృద్ధిలో చైనాను మించిపోతుందని ప్రపంచబ్యాంకు వంటి సంస్థలే చెబుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్‌డీఏ పాలనకు దేశంలోని వివిధ వర్గాల ప్రజల నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను ఓర్వలేకనే కాంగ్రెస్‌ నాయకులు జీఎస్‌టీ బిల్లులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం అవినీతిని దూరం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. యూపీఏ పదేళ్ల పాలనంతా అవినీతిమయమని విమర్శించారు.