రాజకియాల్లోకి రావాల్సి వస్తే..
కచ్చితంగా వస్తా
– జిల్లాల పర్యటన తర్వాత రాజకీయాలపై నిర్ణయం
-సమస్యలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసి పరిష్కారానికి కోరుతా
– విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ
కడప, సెప్టెంబర్3(జనం సాక్షి) : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ రంగమే శ్రేయస్కరమని భావిస్తే రాజకీయాల్లోకి రావడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదని విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆరో రోజైన సోమవారం ఆయన కడప నగరంలోని పలువురు జిల్లా అధికారులు, మేధావులను కలుస్తున్నారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆరు రోజుల పాటు జిల్లాలో రైతులు, విద్యార్థులు, గ్రామస్తులను కలిసి వారి సమస్యలను విన్నానని తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత ప్రజా సమస్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసి పరిష్కరించాలని కోరుతానని పేర్కొన్నారు. అది సాధ్యం కాకపోతే… 13 జిల్లాల పర్యటన తర్వాత తన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్ వంటి వాటిని కేంద్రం వెంటనే అమలు చేయాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మద్యం, కులం, డబ్బు రాజకీయాలు పారద్రోలేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విభజన హావిూల అమలు కోసం పోరాడతామని ఆయన తెలిపారు. వ్యవసాయ, చేనేత కార్మికుల కోసం మేనిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.