రాజకీయ పునరేకీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

5

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి): అధికార పార్టీలో చేరికలు రాజకీయ ఏకీకరణ కోసమేనని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. తెలంగాణ అభివీద్ది ఎజెండగా పునరేకీకరణ జరగాలన్నారు. కొత్తగా ఆవిర్భావించిన తెలంగాణ దశ,దిశకు పునాది ఇప్పుడే గట్టిగా పడాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు టిఆర్‌ఎస్‌లో లాంఛనంగా చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌లో ఎవరూ చేరిన తెలంగాణ రాజకీయ శక్తుల ఏకీకరణగా చూడాలని పేర్కొన్నారు. రాజకీయ శక్తుల ఏకీకరణ సాధ్యమైనప్పుడు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎర్రబెల్లి చేరికను రాజకీయంతో ముడి పెట్టొద్దన్నారు. అభివృద్ధి కోసమే ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అందరం కలిసి పని చేద్దాం. తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని చెప్పారు. తెలంగాణ బాగు కోసమే అందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని తెలిపారు. దయాకర్‌ రావుతో పాటు పార్టీలో చేరిన వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని తెలిపారు. అందరి నాయకత్వంలో వరంగల్‌ జిల్లాను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రాజెక్టులు లేకపోవడం వల్ల గోదావరి నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి. రాబోయే రోజుల్లో జిల్లాలో రెండు పంటలు పండించే విధంగా ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. ఉభయగోదావరి జిల్లాలను మించి వరంగల్‌ జిల్లా అభివృద్ది చెందగలదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే రెండు పంటలు పండుతాయి. ప్రతి ఏటా బడ్జెట్‌లో వరంగల్‌ జిల్లాకు రూ. 300 కోట్లు కేటాయిస్తాం. ప్రజల్లో మనకు మంచి ఆదరణ ఉంది. దాన్ని ఒడిసి పట్టుకోవాలని పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఎపిని గొప్పగా పాలన చేశామని గత ముఖ్యమంత్రులు చెప్పుకుంటారని,కాని ఏ వర్గం సంతోషంగా ఉందని అన్నారు. దళితులు,గిరిజనులు, ముస్లింలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూడాలని అన్నారు. చివరికి బ్రాహ్మణులు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సమాజపరంగా సాధించిన అబివృద్ది ఉమ్మడి ఎపిలో శూన్యం అని ఆయన అన్నారు. వనరులు ఉన్నా అబివృద్ది కాలేదని,తెలంగాణ లో ఇక పై అలా ఉండకూడదని అన్నారు. దయాకరరావు చేరిక ఫక్తు రాజకీయ చేరికగా భావించరాదని అన్నారు. తెలంగాణ దేశం ముందు తల ఎత్తుకు నిలబడాలని, అందులో భాగంగానే రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతోందని అన్నారు. వీటిని చిల్లరమల్లర రాజకీయాలుగా చూడరాదని అన్నారు. దయాకరరావు సీనియర్‌ నేత అని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్‌ నేత సారయ్య, మరో వైపు దయాకరరావు ఇప్పుడు టిఆర్‌ఎస్‌ లో ఉన్నారని, ఇదంతా తెలంగాణ కోసమేనని అన్నారు. అందుకే ఎర్రబెల్లిని ఆహ్వానిస్తున్నానని కెసిఆర్‌ అన్నారు. వరంగల్‌ అబివృద్దికి బ్రహ్మాండమైన ప్రణాళిక తయారైందని ,సాగు నీరు కూడా ఆ జిల్లాకు వస్తుందని కెసిఆర్‌ అన్నారు.పాలకుర్తిలో మిషన్‌ బగీరద కింద తాను వచ్చి కొబ్బరి కాయ కొడతానని అన్నారు. క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ సమక్షంలో వరంగల్‌ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు కార్యకర్తలు తెరాసలో చేరారు. అందులో దొమ్మాటి సాంబయ్య, బస్వారెడ్డి కూడా ఉన్నారు. శతాబ్ద కాలం నుంచి గడీ దొరల కాళ్లకింద నలిగిపోయామని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలోనూ వివక్ష, దోపిడీలకు గురయ్యామన్నారు. అనేక కష్టాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సమైక్య పాలనలో దళితులు, గిరిజనుల జీవితాల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు. తెలంగాణ వాదులంతా ఒక వేదికపైకి వచ్చి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చందూలాల్‌,తలసాని

శ్రీనివాస్‌యాదవ్‌,  ఎమ్మెల్యే రాజయ్య, తెరాస నేతలు బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.