రాజకీయ ప్రయోజనాల కోసమే
కేంద్రం జీఎస్టీ తెచ్చింది
– రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తుంది
– సామాన్యులపై భారం పడకుండా టాక్స్ విధానాలుండాలి
– విలేకరుల సమావేశంలో మంత్రి యనమల
తూర్పుగోదావరి, జూన్30(జనం సాక్షి) : కేందప్రభుత్వం జీఎస్టీని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నాడు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడుతూ… కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని కాపాడతామంటే జీఎస్టీకి తాము మద్దతు పలికామని.. కేంద్రం తన వీటో అధికారంతో రాష్ట్రాల అధికారాలను హరిస్తోందని మండిపడ్డారు. సామాన్యుడిపై భారం పడకుండా.. అదే సమయంలో ప్రభుత్వాల ఆదాయాలు తగ్గకుండా టాక్స్ విధానాలు ఉండాలని ఆయన అన్నారు. ట్రేడర్లకు వేధింపులు ఉండకూడదని.. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ వారెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు. దీన్ని అధికారులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అంతేకాకుండా మనదేశంలో ఒకే స్లాబ్ రేటు అమలు చేస్తే కామన్ మెన్ ఉపయోగించే నిత్యావసరాల ధరలు పెరుగుతాయని యనమల అన్నారు. జీఎస్టీ అమలులో సాంకేతికంగా… విధానపరంగా ఇంకా గందరగోళం నెలకొని ఉందని… సరళీకరణ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పెట్రోలియం, గ్యాస్, మద్యం జీఎస్టీలో చేర్చడానికి మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని.. సంక్షేమ పధకాలకు టాక్స్ ఆదాయం కూడా కీలకమేనని యనమల వివరించారు.