రాజగోపాల్‌ వ్యవహారం క్రమశిక్షణా కమిటీకి..

` ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాం
` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందని, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని మునుగోడు నియోజక వర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారం పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించామని, రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల విషయంలో త్వరలో స్పష్టత వస్తుందని, మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రాజెక్టుల గురించి టిడిపి ఆలోచించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం నుంచి టిడిపి బయటికి రావాలని అన్నారు. అద్దంకి విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. తమ వాట కోసం.. తాము కొట్లాడితే విూకు వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆంధ్రా నీటి పంపకాల్లో బిజెపి నష్టం కలిగిస్తోందని అద్దంకి దయాకర్‌ విమర్శించారు.