రాజయ్య ఇంట్లో పేలుడు పదార్థాల్లేవ్, అందరు ఉన్నారు: వరంగల్ సిపి
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజయ్య నివాసంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బుధవారం నాడు వెల్లడించారు. రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు ఉదయం సజీవ దహనమైన విషయం తెలిసిందే. వారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాజయ్యను, ఆయన భార్య మాధవి, తనయుడు అనీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. అరెస్టు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారికతో పాటు మనవళ్లు అభివన్ (7), అయోన్ (3), శ్రీయోన్ (3)లు మృతి చెందారు. ఈ ఘటనపై తమకు అనుమానం ఉందంటూ సారిక కుటుంబ సభ్యులు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు రాజయ్యతో పాటు ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా వరంగల్ సిపి సుధీర్ విలేకరులతో మాట్లాడారు. రాజయ్య నివాసంలో పేలుడు పదార్థాలు లభించలేదన్నారు. ఫోరెన్సీ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని చెప్పారు. మంగళవారం రాత్రి ఘర్షణ జరిగిందని, ఆ సమయంలో రాజయ్య కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే ఉన్నారన్నారు. కుటుంబ సభ్యుల పైన 498ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.