రాజస్తాన్‌ సెలబస్‌లో నెహ్రు కట్‌

2

జైపూర్‌,మే8(జనంసాక్షి): పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అనగానే భారత తొలి ప్రధాని అని ఠక్కున జవాబిస్తుంటాం. తాజాగా రాజస్థాన్‌లో కొత్తగా రివైజ్‌ చేసిన 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకం నుంచి నెహ్రూ పేరును తొలగించడం వివాదం రేపుతోంది. ఈ చర్యపై కాంగ్రెస్‌ అగ్గివిూద గుగ్గిలమవుతోంది. ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్‌లోకి అందుబాటులోకి రాకపోయినా, పబ్లిషర్‌ రాజస్థాన్‌ రాజ్య పాఠ్యపుస్తక్‌ మండల్‌ వెబెసైట్‌లో ఈ టెస్ట్‌బుక్‌ ఫీచర్లు ఉంచారు. ఇందులో మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, వీరసావార్కర్‌, భగత్‌ సింగ్‌, లాలా లజపత్‌ రాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి ప్రముఖుల పేర్లు చోటుచేసుకున్నాయి. నెహ్రూతో సహా కాంగ్రెస్‌కు చెందిన స్వాంతంత్య్ర సమరయోధుల పేర్లు మాత్రం తొలగించారు. మహాత్మాగాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే ప్రస్తావన కూడా ఇందులో లేదు. రాజస్థాన్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ కింద స్కూళ్లలో వినియోగానికి ఉద్దేశించిన ఈ పుస్తకాల రివిజన్‌ బాధ్యతను ఉదంపూర్‌లోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌ఐఇఆర్‌టి)కు అప్పగించారు. సాంఘిక శాస్త్రం పాత ఎడిషన్‌లో జాతీయోధ్యమం అనే చాప్టర్‌ ఉంది. అందులో కీలక నేతల పేరుతో నెహ్రూను ప్రముఖంగా బాక్స్‌లో ప్రచురించారు. అలాగే స్వాంతంత్య్రం అనంతరం భారతదేశం అనే చాప్టర్‌ పాత ఎడిషన్‌లోనూ నెహ్రూ, పటేల్‌ అందించిన దేశ సేవలు ప్రముఖంగానే ప్రస్తావించారు. కాగా, కొత్తగా సవరించిన జాతీయోధ్యమం చాప్టర్‌లో నెహ్రూ, సరోజిని నాయుడు, మదన్‌మోహన్‌ మాలవీయ వంటి స్వాతంత్య్ర సమరయోధుల ప్రస్తావనే లేదు. పోస్ట ఇండిపెండెన్స్‌ ఇండియా చాప్టర్‌లోనూ నెహ్రూపై మౌనముద్రే వహించారు. రాజేంద్ర ప్రసాద్‌ను మొదటి రాష్ట్రపతిగా, అలాగే సర్దార్‌ పటేల్‌ గురించిన సమగ్ర వివరాలు పొందుపరిచారు.నెహ్రూను ఉద్దేశపూర్వకంగానే చరిత్ర పాఠ్యాంశాల నుంచి తొలగించారా అనే ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆచితూచి స్పందించారు. ‘మంత్రిగా నేను కానీ, ప్రభుత్వం కానీ చేయడానికి ఏవిూ ఉండదు. నేనింకా కొత్త పాఠ్యపుస్తకాలు చూడలేదు. సిలబస్‌ వ్యవహారం అటానమస్‌ బాడీ చూసుకుంటుంది. ప్రభుత్వ జోక్యం ఎంతమాత్రం ఉండదు’ అన్నారు. కాగా, నెహ్రూ సహా పలువురు కాంగ్రెస్‌ సమరయోధుల పేర్లను తొలగించడంపై రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ మండిపడ్డారు. కాషాయివాదాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లే చర్య ఇదని, బిజెపి దివాళాకోరుతనానికి ఇది తాజా నిదర్శనమని ఆయన ఘాటుగా విమర్శించారు. పాఠ్యపుస్తకాల నుంచి నెహ్రూ పేరు తొలగించవచ్చు. కానీ ప్రజల మనస్సులోంచి ఆయన జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరని వ్యాఖ్యానించారు.