రాజస్థాన్‌లో పెరుగుతున్న పులుల మరణాలు

– ప్రతీ ఏటా 34 పులులు చనిపోతున్నాయని నివేదికల్లో వెల్లడి
జైపూర్‌,మే30( జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో ప్రతీ ఏటా 34 పులులు (చిరుత, పెద్దపులులు) చనిపోతున్నట్లు తాజాగా విడుదలైన నివేదికలో వెల్లడైంది. 2012 జనవరి నుంచి 2018 మే 21 వరకు థార్‌ ఏడారికి నెలవైన రాజస్థాన్‌లో 238 చిరుతలు మృత్యువాత పడినట్లు వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెనక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూపీఎస్‌ఐ)తన నివేదికలో పేర్కొంది. వివిధ కారణాలు పులులు మనుగడకు ముప్పు వాటిల్లేందుకు కారణమవుతున్నట్లు డబ్ల్యూపీఎస్‌ఐ తెలిపింది. డబ్ల్యూపీఎస్‌ నివేదిక ప్రకారం.. 2012 నుంచి 2018 మధ్యకాలంలో 84 పులులు సహజసిద్ధంగా మరణించగా.. 52 పులులు రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణించాయి. అంతర్గత సంఘర్షణల కారణంగా 31 పులులు, నిర్బంధం, వేట వల్ల 24 పులులు, గ్రామస్థుల చేతిలో 19 పులులు, 14 ఇతర జంతువుల వల్ల చనిపోయాయని, వీటితోపాటు మరికొన్ని విద్యుత్‌ షాక్‌, సహాయక చర్యల సమయంలో ప్రాణాలు విడిచాయని వెల్లడించింది. చిరుతపులుల జనాభా పెరగడంతో మనుషులకు, జంతువులకు మధ్య సంఘర్షణ ఏర్పడటం కూడా పులుల మృతికి ఓ కారణం అని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ఖింసర్‌ తెలిపారు. గ్రామస్థులు తమను తాము రక్షించుకునేందుకు పులులను చంపుతున్నారని..ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.