రాజా భయ్యా రాజీనామా

లక్నో : ఓ పోలీస్‌ అధికారి హత్య కేసులో ఉత్తరప్రదేశ్‌ మంత్రి రాజాభయ్యా అలియాస్‌ రఘురాజ్‌ ప్రతాప్‌సింగ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సమాజ్‌వాది పార్టీ అధినేత మూలాయం సింగ్‌ యాదవ్‌ ఆమోదించారు. అయితే రాజాభయ్యాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆమె ధ్వజమెత్తారు.ప్రతాప్‌గడ్‌ జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్న  జియా ఉల్‌హక్‌ను శనివారం బలీపూర్‌లో హత్యతో చెలరేగిన హింసాకాండను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు కాల్చిచంపారు. హక్‌ భార్య పర్వీన్‌ ఆజాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజాభయ్యా, అతడి అనుచరులైన నలుగురిపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ కుటుంబానికి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
సీబీఐ దర్యాప్తు చేయాలి
డీఎస్పీ హత్యపై సీబీఐ సంస్థతో దర్యాప్తు జరిపించాలని రాజాభయ్యా డిమాండ్‌ చేశారు. ఈ కేసులో తనపై అభియోగాలు  నమోదు కావడంతో రాజీనామా చేసిన ఆయన యూపీ అసెంబ్లీలో తనపై వచ్చిన ఆరోపణలపై బదులిచ్చారు.