రాజీనామా చేస్తా : బన్సల్
వారించిన ప్రధాని
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బన్సల్ మేనల్లుడు
న్యూఢిల్లీ, మే 4 (జనంసాక్షి):
ఇప్పటికే అవినీతి, కుంభకోణాలతో సతమతమ వుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో చిక్కు వచ్చిపడింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీకే బన్సాల్ మేనల్లుడు రూ.90 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రైల్వేలో ఉన్నత ¬దా ఇప్పించడం కోసం మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూ బన్సాల్ మేనల్లుడు వి.సింగ్లా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి బన్సాల్‌కు కూడా సంబంధం ఉందని, తక్షణమే ఆయన తప్పుకోవాలని విపక్షాలు విరుచు కుపడుతున్నాయి. 2జీ, కోల్‌గేట్, ఆగస్త్యా వంటి కుంభకోణాలతో తలబొప్పి కట్టిన హైకమాండ్‌కు తాజా వ్యవహారం మరో ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే, విపక్షాల ఆరోపణలను బన్సాల్ తోసిపుచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన మేనల్లుడితో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో బన్సాల్ శనివారం ప్రధాని మన్మోహన్‌తో సమావేశమ య్యారు. జరిగిన వ్యవహారంపై వివరణ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాను రాజీనామా చేస్తానని బన్సాల్ చెప్పినట్లు తెలిసింది. అయితే, రాజీనామా వద్దని ప్రధాని వారించినట్లు సమాచారం. ఏం చేయాలనేదానిపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని నిచ్చజెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన మేనల్లుడితో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న తాను ఉన్నత విలువలు పాటిస్తానని తెలిపారు. తాను తీసుకొనే నిర్ణయాల్లో ఎవరి ప్రభావం ఉండదన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ‘నాకు సంబంధించి మేనల్లుడితో పాటు బంధువులు ఎవరితో నాకు లావాదేవీలు లేవు. నా విధి నిర్వహణలో బంధువులు కాని, సన్నిహితుల ప్రభావం ఉండదు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి’ అని ప్రకటనలో తెలిపారు.