రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

3

జూన్‌ 11న ఎన్నిక, నామినేషన్లకు మే31 గడువు

న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశంలోని వివిధ రాష్టాల్ల్రో ఖాళీ అవుతున్న స్థానాలకు జూన్‌ 11న ఎన్నిక నిర్వహించనున్నారు. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణ 2 స్థానాలకు జూన్‌ 11 ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మే 31 తుది గడువుగా నిర్ణయించారు. ఆంధప్రదేశ్‌ నుంచి నిర్మలా సీతారామన్‌, సుజనాచౌదరి, జేడీ శీలం, జైరాం రమేశ్‌, తెలంగాణ నుంచి గుండు సుధారాణి, వి.హనుమంతరావు పదవీకాలం జూన్‌ 21తో ముగియనుంది. దీంతో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల పక్రియకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మరో 57 రాజ్యసభ స్థానాలకు ఈనెల 24న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జూన్‌ 21తో పదవీ కాలం ముగుస్తున్న ముఖ్యుల్లో వెంకయ్యనాయుడు, శరద్‌యాదవ్‌, ఆనంత్‌శర్మ, కేసీ త్యాగి, రాంజెఠ్మలాని, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, అంబికా సోనీ, సురేశ్‌ ప్రభు, కేసీ త్యాగి, పీయూష్‌ గోయెల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తదితరులున్నారు. దీంతో ఈ నెల 24న 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు మే 31 తుది గడువు కాగా, జూన్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. రాష్టాల్ర వారీగా ఖాళీలు పరిశీలిస్తే  తెలంగాణ 2, ఏపీ 4, ఛత్తీస్‌గఢ్‌ 2, మధ్యప్రదేశ్‌ 3, తమిళనాడు 6, కర్ణాటక 4, ఒడిశా 3, మహారాష్ట్ర 6, పంజాబ్‌ 2, రాజస్థాన్‌ 4, ఉత్తరప్రదేశ్‌ 11, ఉత్తరాఖండ్‌ 1, బీహార్‌ 5, జార్ఖండ్‌ 2, హర్యానా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.